close
కూటమికి ఓటమి 

కర్ణాటకలో కుప్పకూలిన కుమారస్వామి సర్కారు 
ఓటింగ్‌లో సభ విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి 
 ‘ఆపరేషన్‌ కమల’ విజయవంతం 
ఈనాడు డిజిటల్‌ - బెంగళూరు

స్వపక్షంలో అసమ్మతి దెబ్బకు కన్నడనాట కుమార పాలన కుప్పకూలింది. కాంగ్రెస్‌- జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. ఆటుపోట్లతో 14 నెలలు కొనసాగిన పాలన చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని 23 రోజులపాటు మిత్రపక్షాలు చేసిన అవిశ్రాంత పోరాటం నిష్ఫలమే అయింది. కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశాక ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలోనైనా ఏదైనా అద్భుతం జరుగుతుందని మిత్రపక్షాలు ఆశగా నిరీక్షించాయి. విశ్వాస తీర్మానంపై మంగళవారం రాత్రి 7.19 గంటలకు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఓటింగ్‌ నిర్వహించారు. తగిన సంఖ్యాబలం లేని సంకీర్ణ ప్రభుత్వం ఆరు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.

ర్ణాటక రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చిస్తున్న వేళ.. గత గురువారమే ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఐదు రోజులుగా చర్చలు, వాయిదాల పర్వమే కొనసాగింది. ఓ దశలో ముఖ్యమంత్రి ఓటింగ్‌కు సిద్ధమవుతారా? లేదా? అన్న అనుమానాలూ వచ్చాయి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ నిర్వహిస్తానని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించడంతో మిత్రపక్షాలు సిద్ధమయ్యాయి. మంగళవారం ఉదయం పదింటికి మొదలైన సభకు గంట తర్వాత పాలకపక్ష సభ్యులు హాజరయ్యారు. తమ సభ్యుడు ఎవరూ గైర్హాజరు కాకుండా ప్రతిపక్ష భాజపా చూసుకుంది. సభ కొనసాగుతున్న కొద్దీ మళ్లీ వాయిదాల పర్వం మొదలవుతుందనే భావించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మధ్యాహ్నం మూడింటి వరకు సభకు రాలేదు. ఆయన మళ్లీ ఏదైనా వ్యూహం పన్నుతున్నారనే వదంతులు వచ్చాయి. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య తాము విశ్వాస పరీక్షకు సిద్ధమన్న సంకేతాలు పంపటంతో మంగళవారం అసలైన పరీక్షకు వేదిక సిద్ధమైంది. తొలుత మూడు గంటల వరకు తాను ప్రసంగిస్తానని స్పీకర్‌కు నోటీసులు పంపిన ముఖ్యమంత్రి సాయంత్రం ఆరింటికి చర్చకు సిద్ధమయ్యారు. గంటన్నరపాటు సుదీర్ఘంగా మాట్లాడి చివరకు ఓటింగ్‌ కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్‌ తొలుత స్వర ఓటింగ్‌పై సభ్యుల అభిప్రాయాలను కోరారు. ప్రతిపక్షం డివిజన్‌ ఓటింగ్‌ను కోరటంతో స్పీకర్‌ దీనికి తగినట్టు ఏర్పాట్లు చేశారు. పాలకపక్షం మద్దతుదారులను వరుసగా లెక్కించారు. అనంతరం ప్రతిపక్షానికి మద్దతిచ్చే సభ్యుల లెక్కింపు ముగిసింది. ఓటింగ్‌ ఫలితాలను 7.40 గంటలకు స్పీకర్‌ వెల్లడించారు. సభకు హాజరైన సభ్యులు 204 మంది. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు.. అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. ఆ వెంటనే పాలకపక్షం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. యడ్యూరప్ప నేతృత్వంలోని భాజపా సభ్యులు విజయ సంకేతాలు చూపుతూ సంబరాలు చేసుకున్నారు. ఓటింగ్‌ ముగిశాక రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం తన రాజీనామాను గవర్నర్‌ వజూభాయి వాలాకు అందజేశారు.

సంతోషంగా వైదొలగుతున్నా.. 
‘ముఖ్యమంత్రి పీఠం నుంచి సంతోషంగా వైదొలగుతున్నా. కేవలం నాలుగు రోజులే నా విశ్వాస తీర్మానంపై చర్చలను కొనసాగించా. స్వార్థంకంటే రాజీనామా చేసిన నా మిత్రులు వస్తారన్న విశ్వాసంతోనే నాలుగు రోజులు ఎదురుచూశా. వారిలో ఏమాత్రం కదలిక రాలేదు’ అని ముఖ్యమంత్రి కుమారస్వామి తన ప్రసంగాన్ని ముగించారు. తాను జీవితంలో ఎన్నో తప్పులు చేశానంటూ 2008లో భాజపాతో కలిసి ఏర్పాటుచేసిన సంకీర్ణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అందరూ అనుకున్నట్లు నేను మాట తప్పలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారీ ఒప్పంద సూత్రాలను సడలించి మిత్రపక్షానికి సహకరించా. నాపై వారే విశ్వాసాన్ని చూపలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఇంతవరకు ఏ ప్రభుత్వ సదుపాయాన్ని పొందలేదు. చేసిన ప్రజాప్రయోజన కార్యక్రమాలను మాధ్యమాలు వక్రీకరించాయి. సామాజిక మాధ్యమం నా వ్యక్తిగత జీవితాన్ని ఛిద్రం చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే అత్యధిక నిధులు మంజూరుచేసినా ఎవరూ గుర్తించలేదు. కేంద్రం మాకు సహకరించలేదు. రైతుల రుణమాఫీ, కరవు పరిహారంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎవరైనా గుర్తించారా?’ అంటూ  సీఎం ఎండగట్టారు. తన తొలి బడ్జెట్‌నుంచి మిత్రపక్షంతో వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఆపై మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలు, రైతుల రుణమాఫీ తదితర కీలక ఘట్టాల్లో తీవ్ర సంకటాలను ఎదుర్కొన్నారు. సీఎం కేవలం కొన్ని జిల్లాలకే పరిమితయ్యారన్న విమర్శ, కుటుంబీకులకు ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రి క్రమంగా విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పటివరకు మిత్రపక్షాల మధ్య లోలోపల రగిలిన అసమ్మతి జ్వాల గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పతనానికి బాటలు వేసింది. తాను సందర్భోచిత శిశువుగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి కుమారస్వామి మిత్రపక్షం కాంగ్రెస్‌తో విసిగినట్లు కన్నీరు పెట్టుకుని వార్తల్లో నిలిచారు. రాజీనామా చేస్తున్న సమయంలో మాత్రం తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

అగ్గిపెట్టిన అసమ్మతి 
కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాలపై ఆధిపత్యానికి మొదలైన అసమ్మతి చివరకు ప్రభుత్వ పతనానికి దారి తీసింది. గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్ఖిహొళితో మొదలైన అసమ్మతి జులై 1న తీవ్రరూపం దాల్చింది. హొసపేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ రాజీనామా, ఆ తరువాత కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు 14మంది రాజీనామాలు చేసి ముంబయికి వెళ్లటం సంకీర్ణ ప్రభుత్వాన్ని కోలుకోలేకుండా చేసింది. 2018 మే 23న ఏర్పాటైన ప్రభుత్వం 2019 జులై 23న వైదొలగాల్సి వచ్చింది.

14 నెలలూ ఆపసోపాలే 
2018 మే 15న కర్ణాటక విధానసభకు ఎన్నికలు నిర్వహించగా ఏ పార్టీకి ఆధిక్యం దక్కలేదు. 
104 స్థానాలు సాధించిన భాజపా మే 17నుంచి 19వరకు అధికారంలో ఉన్నా తర్వాత మిత్రపక్షాల పొత్తుకు తలొగ్గింది. 
78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌, 37 స్థానాలతో ఉన్న జేడీఎస్‌, ఇద్దరు స్వతంత్రులు, బీఎస్పీ సహకారంతో సంకీర్ణ కూటమికి బాటలు పడ్డాయి. 
మే 23న సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి ఈ 14 నెలలూ ఆపసోపాలతోనే పాలన సాగించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.