close
పాలన కొత్త పుంతలు  

గాంధీ జయంతి నుంచి కొత్త రెవెన్యూ చట్టం
చట్టాలు, సంస్కరణలతో నూతన ఒరవడి
జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌
9 గంటల పాటు సమావేశం
ప్రజలకు చేరువ కావాలని కలెక్టర్లకు నిర్దేశం
కొందరి పనితీరుపై అసంతృప్తి
నేడు సిద్దిపేట జిల్లా కోమటిబండలో సమావేశం

* జిల్లా యంత్రాంగం క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు మీరు సంధానకర్తలుగా ఉన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలి. సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలి. ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలి. పాలనలో ప్రతి అంశం కీలకమైందే.

* తెలంగాణ అయిదేళ్ల పాలన పూర్తి చేసుకొంది. మా పాలన సంతృప్తికరంగా సాగింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులేమీ ఎదురుగాకుండా చూడాలి. వారు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావద్దు. ఒకసారి వెళ్తే అన్నీ పరిష్కారం కావాల్సిందే.

- కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కొత్త చట్టం విప్లవాత్మకమైందని, వ్యవస్థలోని లొసుగులన్నింటినీ తొలగించి, ప్రజలందరికీ కష్టాలు తీర్చేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. సెప్టెంబరులో జరిగే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో దానిని ఆమోదిస్తామని చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలు, సంస్కరణల ద్వారా తెలంగాణ పాలన కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. చట్టాలను నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు. 60 రోజుల ప్రత్యేక ప్రణాళికతో పట్టణాలు, గ్రామాలు కొత్త రూపు సంతరించుకుంటాయని చెప్పారు.

తెలంగాణను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో కలెక్టర్లు భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకూడదనేది తమ అభిమతమని చెప్పారు. కలెక్టర్లు ప్రగతికి వారధులుగా మారాలని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా దీనిని నిర్వహించారు. మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై విస్తృతంగా చర్చించారు. వీఆర్వోలు, సర్వేయర్ల వ్యవస్థ రద్దు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారులను వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖల్లో విలీనంపైనా మాట్లాడారు.

అనంతరం జిల్లా కలెక్టర్లు మాట్లాడారు. సీఎం ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. ‘‘ప్రస్తుతం రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉంది. ప్రతి గ్రామంలో దీనికి సంబంధించిన సమస్యలున్నాయి. కిందిస్థాయి నుంచి అవినీతి జరుగుతోంది. రెవెన్యూ వ్యవస్థను సమగ్రంగా మార్చాలని నిర్ణయించాం. ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థ ఉంటుంది. రెవెన్యూ వ్యవస్థలో ప్రస్తుతం కలెక్టర్లు కీలకంగా ఉన్నారు. కొత్త వ్యవస్థలోనూ వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎవరెవరి సేవలు ఎలా అవసరమో అలా ఉపయోగించుకుంటాం.

పంచాయతీరాజ్‌ చట్టంపై...
గ్రామీణ తెలంగాణకు కొత్త రూపు కోసం పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చాం. పట్టణాలు, నగరాల రూపురేఖల మార్పిడికి పురపాలక చట్టం వచ్చింది. గ్రామాలలో, పట్టణాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజా భాగస్వామ్యం సాధించి గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలని సూచించాం. ఈ కార్యక్రమానికి ముందే స్థానిక సంస్థలకు నిధులు విడుదలచేస్తాం. ఈ చట్టాల ప్రకారమే పాలన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగిస్తున్నాం. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యాలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలి. పురపాలక సంఘాలకు ఆదాయం రావాలి. అది సద్వినియోగం కావాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు పరిపాలనాపరంగా కూడా పటిష్ఠంగా ఉండేలా పర్యవేక్షించాలి.

కాళేశ్వరాన్ని సందర్శించాలి
ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నాం. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశాం. గోదావరి జలాలతో మన కష్టానికి ఫలితం వచ్చింది. ప్రాజెక్టు కళకళ లాడుతోంది. కలెక్టర్లు ఈ మానవనిర్మిత అద్భుతాన్ని స్వయంగా పరిశీలించాలి. త్వరలోనే ప్రాజెక్టును సందర్శించాలి. జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు నడుం బిగించాలి. కార్యాలయాలకు పరిమితం కారాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీ(కలెక్టర్ల)పై పనిభారం మోపం గానీ పాలనకు మీరు చుక్కానిగా నిలవాలి. కలెక్టర్లకు అభివృద్ధిపై ముందు చూపు ఉంటుందని, ఆలోచనలు భిన్నంగా ఉండటంతోపాటు కొత్త అంశాలపై అవగాహన కలిగి ఉంటారనే విశ్వాసంతో కొత్త చట్టాలలో కీలక భాగస్వాముల్ని చేశాం.

కలెక్టర్‌ పేరు మారుస్తాం
కలెక్టర్‌ పేరు మార్చి కొత్త పేరు తెస్తాం. పన్నుల వసూళ్ల కోసం బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో ఈ పేరు పెట్టారు. ఇప్పుడు పన్నుల వసూళ్లు లేవు. కలెక్టర్‌ అని ఉండడం సహేతుకం కాదు. పాలనాధికారి లేదా మరో పేరు గురించి ఆలోచిస్తున్నాం.

లంచం లేనిదే పనికావడం లేదని వేల సంఖ్యలో ఫిర్యాదులు
లంచాలు లేనితే పనులు కావడం లేదని ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. తప్పు చేస్తున్నామనే భయం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇది జరుగుతోంది. ఈ దుస్థితిపోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. అవినీతిపై కలెక్టర్లు నిఘా వేయాలి. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలి’’ అని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ముందుగా నిర్ణీత నమూనాతో కూడిన పత్రాలు అందించి వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. వారితో సీఎం మాట్లాడారు. సమావేశ వివరాలను బహిర్గతం చేయరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

నేడు సిద్దిపేట జిల్లా సందర్శన
రెండోరోజు కలెక్టర్ల సమావేశాన్ని సిద్దిపేట జిల్లాలో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ముందుగా సింగాయపల్లి, ఆ తర్వాత గజ్వేల్‌ మీదుగా కోమటిబండ చేరుకొని సమావేశమవుతారు. హరితహారం, మిషన్‌ భగీరథల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు మూడు బస్సుల్లో కలెక్టర్లు కోమటిబండకు వెళ్తారు.


కలెక్టర్లు చురుకుగా వ్యవహరించాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముంగిటకు పాలన అందించేందుకు సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లా సంఖ్యను 10 నుంచి 33కి పెంచడం వల్ల కలెక్టర్లుగా చాలా మందికి అవకాశం వచ్చింది. కలెక్టర్లలో కొంత మంది మాత్రమే బాగా పనిచేస్తున్నారు. మిగిలిన వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. కలెక్టర్లు జిల్లా పాలనపై తమదైన ముద్ర వేయాలి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వారి ప్రత్యేకత కనిపించాలి. కలెక్టర్‌ గట్టిగా ఉంటే యంత్రాంగం బాగా పనిచేస్తుంది. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోల వంటి వారు అవినీతికి పాల్పడుతున్నారంటే దానికి కారణాలేమిటో కలెక్టర్లు తెలుసుకోవాలి. ఉద్యోగులు తెలంగాణ బిడ్డలే. చాలా మంది ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. కొంత మంది దారి తప్పుతున్నారు. వారిని సరైన మార్గంలో నడిపించేందుకు కలెక్టర్లు కృషి చేయాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.