close
అమెరికా ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయుల విజయం

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన రాష్ట్ర స్థాయితోపాటు, స్థానిక ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయులు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. వీరిలో ఒక ముస్లిం మహిళ కూడా ఉన్నారు. వర్జీనియా రాష్ట్ర సెనేట్‌ సభ్యురాలిగా గజాలా హష్మీ విజయం సాధించారు. కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికయిన ప్రథమ ముస్లిం మహిళ ఆమే కావడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ఒబామాకు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన సుహాస్‌ సుబ్రహ్మణ్యం..వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా మనో రాజు గెలుపొందారు. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌ సిటీ కౌన్సిల్‌కు డింపుల్‌ అజ్మీరా రెండోసారి ఎన్నికయ్యారు.

వర్జీనియా సెనేటర్‌గా గజాలా హష్మీ...

విద్యావేత్తగా పాతికేళ్ల అనుభవం ఆమె సొంతం. స్థానిక సమస్యలపై తనకంటూ అవగాహన పెంచుకున్న ఆమె... వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చింది. తాజాగా వర్జీనియా సెనేటర్‌గా ఎంపికైంది. ఆమే హైదరాబాదీ గజాలా హష్మీ. గజాలా కుటుంబం 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లి జార్జియాలో స్థిరపడింది. అప్పటికి ఆమె చాలా చిన్నది. దాంతో ఆమె ప్రాథమిక విద్య, ఉన్నతోభ్యాసమంతా అమెరికాలో సాగింది. జార్జియా సదరన్‌ యూనివర్సిటీలో బీఏ చేసి, ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తరువాత అజహర్‌తో పెళ్లయ్యింది. భర్తతో కలిసి 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి వెళ్లిన గజాలా... దాదాపు పాతికేళ్లపాటు వర్జీనియా కళాశాల, విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తగా పనిచేసింది. ప్రస్తుతం రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజీ, టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ ద సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ (సీఈటీఎల్‌) లో ఫండింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. అక్కడ స్థిరపడిన ఆమె... ఆ వాతావరణం, పెరుగుతోన్న వాతావరణ కాలుష్యం, పరిసరాల సమస్యలపై అవగాహన పెంచుకుంది. వాటిని తనవంతుగా పరిష్కరించాలంటే... రాజకీయాల్లోకి రావడమే సరైన మార్గమని నిర్ణయించుకుంది.  కాలుష్యాన్ని నివారించేలా... కుటుంబసభ్యుల సహకారంతో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసి, గెలిచింది. ఆ స్థానాన్ని పొందిన, మొదటిసారి విజయం సాధించిన తొలి ముస్లిం మహిళగా, తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిందామె. ఈ ఎన్నికలు గత మంగళవారం అమెరికాలో జరిగాయి. ‘ఈ విజయం నా ఒక్కదానికే పరిమితం కాదు. వర్జీనియాలో మార్పు కోరుకుంటూ... నాపై నమ్మకాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరిదీ. జనరల్‌ అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉంటా. స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా నాదైన ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా పర్యావరణ కాలుష్య కోరల్లో చిక్కుకున్న వర్జీనియాను దాన్నుంచి బయటపడేలా చేయాలనుకుంటున్నా. స్థానికుల ఆరోగ్య పరిరక్షణ, ప్రజావిద్యకు నిధులు సేకరణ... వంటి అంశాలపై పనిచేయాలనుకుంటున్నా...’ అని చెబుతుందామె. ఆమె విజయాన్ని హిల్లరీ ప్రశంసిస్తూ... ‘గజాలా సాధించిన ఈ విజయం మహిళలందరికీ చెందుతుంది. వర్జీనియాలో పూర్తిస్థాయిలో మార్పు రావాలని కోరుకునేవారందరికీ ఈ విజయం చెందుతుంది...’ అని ట్వీట్‌ చేశారు.  విద్యావేత్తగానే కాదు... స్ట్రాటజిక్‌ ప్లాన్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. వర్జీనియా సెంటర్‌ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ కమ్యూనిటీస్‌, రిచ్‌మండ్‌ చాప్టర్‌ బోర్డు మెంబర్‌గా... పనిచేసిందామె. దాదాపు రెండేళ్లపాటు గాళ్స్‌ స్కౌట్స్‌ ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాకు ట్రూప్‌లీడర్‌గానూ వ్యవహరించిందామె. సమాజాన్ని అభివృద్ధి చేస్తే... అన్ని వర్గాల ప్రజల్నీ ఏకం చేయొచ్చని నమ్ముతుందామె. ప్రస్తుతం రెనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజీ... సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌కి ఫౌండింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం సామాన్యులకు పూర్తిస్థాయిలో సేవలందించేలా కృషి చేసిందామె. వర్జీనియా డిస్ట్రిక్ట్‌ -10కి సెనేటర్‌గా ఎంపికయ్యిందామె. ప్రజావిద్య, ఆరోగ్యం... వంటివాటిపై కృషి చేసే ప్రయత్నంలో ఉందామె.

సుహాస్‌ సుబ్రహ్మణ్యం: ప్రవాస భారతీయులు అధికంగా ఉండే లౌడన్‌ అండ్‌ ప్రిన్స్‌ విలియం జిల్లా నుంచి గెలుపొందారు. ఆయన తల్లి బెంగళూరుకు చెందిన వైద్యురాలు. 1979లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు సుహాస్‌ అయనకు సలహాదారునిగా పనిచేశారు. ఆరోగ్యం, వృద్ధుల సంక్షేమం, సాంకేతిక రంగాల్లో సలహాలు ఇచ్చారు. సైబర్‌ భద్రత, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉద్యోగాలు కోల్పోతే ప్రత్యామ్నాయాల కల్పన, ఉద్యోగాల సృష్టి తదితర అంశాలపై ఒబామా ఏర్పాటు చేసిన కార్యదళంలో పనిచేశారు.

మనో రాజు: కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశారు. ప్రొఫెసర్‌ కెండాల్‌ థామస్‌ పర్యవేక్షణలో క్రిటికల్‌ రేస్‌ థియరీపై పరిశోధన చేశారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ ఉపకారవేతనం పొందారు. బర్కెలీలోని సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో ఎం.ఏ డిగ్రీ చేశారు. బెర్కలీ స్కూల్‌ ఆఫ్‌ లాలో న్యాయవాద పట్టా పొందారు. న్యాయవిద్యార్థిగా ఉన్నప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌ కార్యాలయంలో శిక్షణ పొందడం గమనార్హం.

డింపుల్‌ అజ్మీరా: 16 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చారు. ఆ సమయంలో ఆమెకు ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఏమాత్రం రాదు. అయినా యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో చేరి పట్టుదలతో చదివి ప్రతిభను నిరూపించుకున్నారు. సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌ (సీపీఏ)గా పనిచేశారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.