close
కనీస ఛార్జి రూ.10

పెంచిన ఆర్టీసీ టికెట్‌ ధరలు అమలులోకి
పెరిగిన విద్యార్థులు, ఎన్జీవోల బస్సు పాసుల ధరలు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ పెంచిన టికెట్‌ ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అన్ని రకాల బస్సులకు ఛార్జీల పెంపుదల అమలు కానుంది. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారులు మూడు రోజులుగా కసరత్తు చేసి ఛార్జీల పెంపు వివరాలను సోమవారం ప్రకటించారు. అన్ని సర్వీసుల కనీస ఛార్జీలను కూడా సవరించింది. చిల్లర సమస్యను అధిగమించేందుకు కొన్ని బస్సులకు రూ.అయిదుకు, మరికొన్నింటికి 10 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు రూ.163 టికెట్‌ ధర ఉంటే దాన్ని రూ.165 గాను.. అదే రూ.167 ఉంటే రూ.170 గాను ఛార్జీలను సవరించింది. 2016 జూన్‌ తరువాత ఛార్జీలను పెంచింది. విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీలను 2013 తరువాత పెంచడం ఇదే మొదటిసారి.  నెలవారీగా జారీ చేసే బస్‌ పాసు ఛార్జీలనూ ఆర్టీసీ యాజమాన్యం పెంచింది. ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కాంబో టికెట్‌ ధరలను కూడా పెంచింది. విద్యార్థులకు మూణ్నెల్లకు ఒకదఫా చెల్లుబాటయ్యే పాస్‌ను యాజమాన్యం జారీ చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తొలి 4 కిలోమీటర్లకు రూ.130 ఉన్న ఛార్జీని రూ.165కు పెంచింది. గరిష్ఠంగా 23 కిలోమీటర్లకు ప్రస్తుతం రూ.265గా ఉన్న ధరను రూ.330కి పెంచింది. హైస్కూలు, కళాశాల విద్యార్థుల బస్‌పాస్‌లో తొలి 5 కిలోమీటర్లకు రూ.235గా ఉన్న ధరను రూ.310కి, గరిష్ఠంగా 35 కిలోమీటర్లకు రూ.775 ఉన్న ధరను రూ.1,025కి పెంచింది. ప్రభుత్వోద్యోగులకు నెలవారీగా జారీ చేసే ఆర్డినరీ బస్‌పాస్‌ను రూ.770 నుంచి రూ.950కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ధరను రూ.880 నుంచి రూ.1,070కి, మెట్రో డీలక్స్‌ పాస్‌ ధరను రూ.990 నుంచి రూ.1,185గా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఆర్డినరీ బస్‌ పాస్‌ ధరను రూ.260 నుంచి 320కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ధరను రూ.370 నుంచి రూ.450, మెట్రో డీలక్స్‌ పాస్‌ ధర రూ.480 నుంచి రూ.575కు సవరించింది. ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కాంబో పాస్‌ ధరను రూ.880 నుంచి రూ.1,090కు యాజమాన్యం పెంచింది. ప్రస్తుతం ఉన్న క్యాట్‌, వనిత కార్డు చెల్లుబాటు గడువు ముగిసేంత వరకు యథావిధిగా 10 శాతం రాయితీని కొనసాగించాలని నిర్ణయించింది.

ఆగస్టు వరకు రూ.303.39 కోట్ల నష్టం
ఈ ఏడాది ఆగస్టు నెల వరకు ఆర్టీసీకి రూ.303.39 కోట్లు నష్టం వాటిల్లిందని సోమవారం జారీ చేసిన ఛార్జీల పెంపుదల ఉత్తర్వుల్లో ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలు పెంచిన సందర్భంలో రూ.4,233.05 ఆదాయం లభించగా రూ.4,982.33 కోట్లు ఖర్చయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,570 కోట్ల ఆదాయం లభించగా ఖర్చు రూ.5,319.27 కోట్లు కావడంతో రూ.748.90 నష్టం వచ్చింది. 2018-19లో ఆదాయం రూ.4,882.72 కోట్లు, వ్యయం 5,811.39 కోట్ల రూపాయలు కావడంతో రూ.928.67 కోట్ల నష్టం నమోదైంది. 2018 అక్టోబరులో ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం తాత్కాలిక భృతి ఇవ్వడంతో రూ.133.07 కోట్ల భారం పడినట్లు సునీల్‌శర్మ పేర్కొన్నారు.

కనీస ఛార్జీలు (రూపాయల్లో)
* పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల కనీస ఛార్జీ: 10
* ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు: 15
* డీలక్స్‌ బస్సుకు: 20
* సూపర్‌ లగ్జరీ బస్సుకు: 25
* రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌, ఏసీ బస్సులకు: 35
* వెన్నెల, ఏసీ స్లీపర్‌కు: 70

గ్రేటర్‌ పరిధిలో...
* కనీస ఛార్జీ రూ.10. చిల్లర సమస్యను అధిగమించేందుకు టికెట్‌ ధరను దగ్గరి రూ.5కి..
* ఆర్డినరీ బస్సు ప్రస్తుత కనీస ఛార్జీ రూ.5 నుంచి రూ.10కి పెంచారు. గరిష్ఠ ధరను రూ.30 నుంచి రూ.35కు..
* మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీస ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.45కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.