close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాకపోకలకు అనుమతులు అక్కర్లేదు

విమానాలు, రైళ్ల సేవలు విస్తరణ
జులై 31 వరకూ విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, మెట్రో రైళ్లు మూసివేత
రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0
కేంద్రం మార్గదర్శకాలు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించింది. మంగళవారం నాటితో అన్‌లాక్‌-1.0 ముగుస్తుండడంతో జులై 1 నుంచి అన్‌లాక్‌-2.0 మొదలుకానుంది. దీనిలో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది.

జులై 31 వరకు నిషేధం అమలయ్యేవి ఇవి...
పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలు
కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా మిగిలిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, భారీ సమావేశాలు
ఏవేవి నడుస్తాయి?
దేశీయ విమానాలు, రైళ్ల రాకపోకలను ఇప్పటికే పరిమితంగా అనుమతించారు. వాటిని భవిష్యత్తులో క్రమంగా విస్తరిస్తారు.
ఆన్‌లైన్‌, దూరవిద్య విధానాలను కొనసాగించుకోవచ్చు.
జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు తెరుచుకోవచ్చు. వీటి నిర్వహణకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీచేస్తుంది.
కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రార్థన మందిరాలు, హోటళ్లు, అతిథ్య సేవలు, షాపింగ్‌ మాళ్లు.
వీటిని అడ్డుకోకూడదు
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రాష్ట్ర పరిధిలోనే ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్లడానికి మనుషులపై కానీ, సరకు రవాణాపై కానీ ఎలాంటి ఆంక్షలు విధించడానికి వీల్లేదు. ఇలాంటి రాకపోకలకు ప్రత్యేక అనుమతులు/ ఈ-పర్మిట్లు అవసరం లేదు.
ప్యాసింజర్‌ రైళ్లు, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, విదేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపు, భారత్‌ నుంచి విదేశీయుల తరలింపు, సముద్ర ప్రయాణికుల రాకపోకలు వంటివి ఇప్పటికే జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి.
రాత్రి కర్ఫ్యూ యథాతథం
రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. అత్యవసర కార్యకలాపాలను, జాతీయ/ రాష్ట్ర రహదారుల్లో ప్రజల రాకపోకలను, సరకు రవాణాను, బస్సులు/ రైళ్లు/ విమానాలు దిగి ప్రజలు వారి గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు అడ్డుకోకూడదు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీచేసే మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను నిర్ధారించాలి.
ఈ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతివ్వాలి. ఈ జోన్ల బయట వైరస్‌ ప్రబలడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్‌ జోన్లుగా గుర్తించాలి. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట కొన్ని కార్యకలాపాలపై రాష్ట్రాలు ఆంక్షలు విధించుకోవచ్చు.

నేడు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటం, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడం వంటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.