close

ప్రధానాంశాలు

పరిష్కర్తలు ముఖ్యమంత్రులే

కృష్ణాజల వివాదాలను రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
జలవనరుల మంత్రిత్వ శాఖ సమావేశంలో కీలక నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు చర్చించుకుంటేనే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నదీజలాల పంపిణీ, తుంగభద్ర, కృష్ణా బోర్డు తరలింపు.. ఇలా ఒక్కోదానికి ఒక్కో మార్గం ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కొలిక్కి వచ్చే అంశాలే అధికం. దిల్లీ వేదికగా వారు భేటీ అయితే సమస్యలనేవి ఉండబోవు... మంగళవారం దిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించిన అభిప్రాయాలివి. శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఆర్కే గుప్తా, గోదావరి, కృష్ణా బోర్డుల ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగగా దేని పరంగానూ స్పష్టత రాలేదు.

త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం
ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణానదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రుల స్థాయిలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. సమావేశం ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వ అధికారులు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. నదీ యాజమాన్య బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్‌పై జరిగిన చర్చలో రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు ప్రకటించాయి. బోర్డుల పరిధిని వెంటనే నిర్ణయిస్తే మేలని కేంద్ర కార్యదర్శి యూపీ సింగ్‌ బోర్డు ఛైర్మన్లకు సూచించినట్లు తెలిసింది.

పట్టిసీమ వాటా
పట్టిసీమ ద్వారా కృష్ణా పరీవాహకానికి జలాలు మళ్లిస్తున్నందున గోదావరి జలాల్లో 45 టీఎంసీల వాటాను ఇవ్వాలని తెలంగాణ కోరింది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనని ఏపీ పేర్కొంది. దీనిని తేల్చేందుకు కేంద్రం కమిటీ వేసినా ఫలితం లేకపోయిందని ఇప్పటికైనా వెంటనే తేల్చాలని తెలంగాణ పట్టుబట్టింది. స్పష్టత కోసం తామూ కేంద్ర జలసంఘానికి లేఖ రాసినట్లు గోదావరి బోర్డు తెలిపింది.

అపెక్స్‌ కౌన్సిల్‌ వైపు చూపు
కొత్త ప్రాజెక్టుల అంశంపై చర్చలో రెండు రాష్ట్రాలు పరస్పరం విభేదించాయి. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ ఆధునికీకరణ అంశాన్ని తెలంగాణ లేవనెత్తింది. తుంగభద్ర నుంచి 15.9 టీఎంసీల వాటా ఆర్డీఎస్‌కు రావాల్సి ఉండగా తాము తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించామని తెలిపింది. దీనిపై ఏపీ ఫిర్యాదుచేయడం సమంజసం కాదంది. ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు ముందుకు సాగడంలేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం లేఖరాస్తే సంబంధిత రాష్ట్రాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని కేంద్రం పేర్కొంది. కృష్ణా పరీవాహకానికి వరదల సమయంలో తాము వినియోగించిన నీటిని వాటాల్లో కలుపొద్దని ఏపీ కోరింది. దీనిని తేల్చేందుకు కృష్ణాబోర్డు కమిటీని వేసినందున నివేదిక వచ్చాక సంప్రదింపులు జరుపుతామని కేంద్రం సూచించింది.

పాత పద్ధతిలోనే జలాల పంపిణీ
కృష్ణా జలాల పంపిణీపై చర్చ సందర్భంగా పాత పద్ధతిలోనే అంటే తెలంగాణకు 36.87, ఏపీకి 63.13 శాతం చొప్పున పంపిణీ చేపట్టాలని కృష్ణాబోర్డుకు కేంద్రం సూచించింది. కొంతకాలం నుంచి తెలంగాణ, ఏపీలు 34, 66 శాతం చొప్పున పంపిణీ చేసుకుంటున్నాయని బోర్డు పేర్కొంది. రెండు రాష్ట్రాలు ఏది అనుకూలమైతే దానినే పాటించాలని కేంద్రం సూచించింది.

కృష్ణా బోర్డు తరలింపు
బోర్డును హైదరాబాద్‌లోనే కొనసాగించాలని తెలంగాణ అధికారులు సూచించగా ఏపీలో అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు హైదరాబాద్‌లోనే కొనసాగించేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. కర్నూలులో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసే అంశంపై దృష్టిసారించినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నట్లు తెలిసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.