close

ప్రధానాంశాలు

కొవిడ్‌ కేసులపై పోలీస్‌ నజర్‌

జమాతే ఉదంతంతో ప్రభుత్వం సీరియస్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడికి స్వయంగా తెలంగాణ పోలీసు శాఖ రంగంలోకి దిగింది. పాజిటివ్‌ కేసులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించే పనిలోకి దిగింది. విదేశాలకు లేదా దిల్లీ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిలో పాజిటివ్‌ లక్షణాలు కలిగిన వారిని ఇప్పటికే గుర్తించినా మరింత లోతైన దర్యాప్తు మొదలుపెట్టనుంది. కరోనా సోకిన వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో వైద్య, పురపాలక, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు పోలీసులు వారికి జత కానున్నారు. దిల్లీలో తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో కరోనా లక్షణాలుంటే వారు ఎక్కడివారైనా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి, మిగతావారిని తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక్కడికి వచ్చాక ఏం చేశారు?
దిల్లీకి వెళ్లిన 1,030 మందిలో 603 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉండడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేష్‌భగవత్‌లతో చర్చించారు. జమాతే సందర్శకులు ఇక్కడికి వచ్చాక ఎంతమందిని కలిశారు? ఏమేం చేశారు? తదితర వివరాలు పక్కాగా సేకరించాలని ఆదేశించారు. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వారి వివరాలు సేకరిస్తున్నాయి. ఇంకా 150మంది ఆచూకీ దొరకాల్సి ఉందని సమాచారం. బుధవారం సాయంత్రానికి మొత్తం 350 మంది అనుమానితులను గాంధీకి తరలించారు.  మిగతావారిని వారివారి జిల్లాల్లో ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

క్వారంటైన్‌.. లేదా ఆసుపత్రికి
ఇప్పుడు ఇళ్లలో స్వీయ నిర్బంధం పద్ధతికి స్వస్తి చెప్పారు. దిల్లీ వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మరణించడం, జమాత్‌లో పాల్గొని వచ్చిన వ్యక్తిని ఇంటికి ఆహ్వానించిన ఓ పాత్రికేయుడు కరోనాతో చనిపోవడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రికి, లేకుంటే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. పొరుగు జిల్లాలో పనిచేస్తున్న ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చాక అనారోగ్యానికి గురికావడంతో పాతబస్తీలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిసింది. ఆయననూ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

పోలీసులు ఏం చేస్తారు?
మొదట కరోనా సోకినవారి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం సేకరించడంతోపాటు వారి ద్వారా రెండో, మూడో దశల్లో ఎవరెవరికి సోకే అవకాశముందో పోలీసులు అంచనా వేస్తారు. అలా వైరస్‌ సోకే అవకాశమున్నవారిని గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షిస్తారు. కరోనా సోకిన వ్యక్తి పేరిట రూపొందించే షీట్‌లో ఎప్పటికప్పుడు తాజా వివరాల్ని పొందుపరుస్తారు. బాధితుల సమగ్ర సమాచారం తయారుచేసి వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం ద్వారా ‘కోవిడ్‌ క్లస్టర్‌ రహిత పోలీస్‌స్టేషన్‌’ను, తద్వారా ‘కరోనా రహిత తెలంగాణ’ సాధనే లక్ష్యంగా పోలీస్‌శాఖ ఈ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

ఎవరెవర్ని కలిశారో!
జమాత్‌కు వెళ్లి వారిలో అనేకమంది చిన్నచిన్న వృత్తులవారు ఉన్నారు. ఉదాహరణకు లంగర్‌హౌస్‌కు చెందిన ఒక వ్యక్తి చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. దిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచీ తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు. దాంతో ఆ చికెన్‌ దుకాణంలో కొనుగోలు చేసిన వారంతా భయపడుతున్నారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. మొదట వారి కుటుంబ సభ్యులను, ఆ తర్వాత సదరు వ్యక్తి ఎవరెవర్ని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ జిల్లా ఎస్పీలు, కమిషనర్లు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.


జాగ్రత్త నిన్ను రక్షిస్తుంది..లేదంటే ఎందర్నో శిక్షిస్తుంది!

దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి మలక్‌పేటలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు బుధవారం ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ధరింపజేసిన రక్షణ దుస్తులను ఆయన చించేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించాడు. చివరికి స్థానిక నాయకుల జోక్యంతో రక్షణ దుస్తులు లేకుండానే ఆంబులెన్స్‌ ఎక్కాడు.

- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.