close

ప్రధానాంశాలు

మీ సేవలు భేష్‌

పోలీసులకు హైకోర్టు ప్రశంస
కాస్త సంయమనం పాటించాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ అమలులో పోలీసులు, వైద్యుల పాత్రను హైకోర్టు ప్రశంసించింది. అయితే రోడ్డుపైకి వచ్చినవారి విషయంలో పోలీసులు కాస్త సంయమనం పాటించాలని సూచించింది. వనపర్తిలో జరిగిన ఘటనను రాష్ట్రానికంతటికీ వర్తింపజేయడం సరికాదని, ఈ సమయంలో పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయకూడదని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలపై పలువురు న్యాయవాదులు రాసిన వేర్వేరు లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణనలోకి తీసుకుంది. వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు దాడి చేశారని, దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. వారికి రక్షణ కల్పించాలని మరో లేఖ అందింది. ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షలకు వెళ్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్‌లో కోత విధించడం చట్టవిరుద్ధమంటూ ఇంకో లేఖ అందింది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడానికి వీల్లేదని జీవో జారీ చేసిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం సరికాదని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.48 కోట్లు విరాళంగా ప్రకటించారన్నారు. పింఛన్‌ సొమ్ములో కోత విధిస్తే జీవనోపాధి కష్టమవుతుందన్నారు. మందులు, నిత్యావసర సరకులు, కూరగాయలు తదితరాల కోసం కరోనా ప్రభావ రహిత కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని మరో లేఖ అందింది. వీటన్నింటిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమరనాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు, వైద్యులు, వైద్యసిబ్బంది సేవల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూనే రోడ్డుపైకి వచ్చినవారిపై పోలీసులు దాడికి దిగకుండా వివరాలు తెలుసుకోవాలని సూచించింది. ఈ అంశాలపై ఈ నెల 16లోగా విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.