close

ప్రధానాంశాలు

ఒకే రోజు 45 శ్రామిక్‌ రైళ్లు

70 వేల మందికి పైగా తరలించేందుకు ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల్ని శనివారం భారీ ఎత్తున తరలించనున్నారు. ఒకేసారి 45 రైళ్లలో దాదాపు 60-70 వేల మందిని సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో 43 రైళ్లు హైదరాబాద్‌, శివారు ప్రాంతాల నుంచి, రెండు రైళ్లు వరంగల్‌ నుంచి బయల్దేరతాయి. మే 1వ తేదీ నుంచి శ్రామిక్‌ రైళ్లు ప్రారంభమయ్యాక ఇదే అత్యధికం కానుంది. శుక్రవారం శ్రామిక్‌ రైళ్లు నడపలేదు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఒక్కో స్టేషన్‌ నుంచి ఒక్కో రాష్ట్రం వలస కార్మికుల్ని తరలించేలా ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి శ్రామిక్‌ రైళ్లు బయలుదేరుతుండడంతో పోలీస్‌ అధికారులు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసముంటున్న వలస కార్మికులను మధ్యాహ్నం రెండు గంటల్లోపు రైల్వేస్టేషన్లకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌ ఠాణాకు ఐదు బస్సుల చొప్పున మూడువందలకు పైగా బస్సులను సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రానికి రైళ్ల జాబితాను సంబంధిత పోలీస్‌ ఠాణాలకు పంపించారు. ఎంపిక చేసిన వారికి శనివారం ఉదయం 10గంటల్లోపు సమాచారం ఇచ్చి మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్‌ఠాణాల వద్దకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి
ఈనాడు, హైదరాబాద్‌: జూన్‌ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్‌ సర్వీసులను రైల్వేశాఖ ‘ప్రత్యేక’ంగా నడిపించనున్న నేపథ్యంలో ఆ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు 90 నిమిషాల ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడానికి వీలుగా ఈ సమయాన్ని నిర్దేశించింది. రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎదురెదురుగా రాకుండా నివారించేందుకు స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి ద.మ.రైల్వే పరిధిలోని 73 స్టేషన్లలో కౌంటర్లలో బుకింగ్‌ మొదలైంది. భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి సేవాకేంద్రాలు, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్‌ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది.
ద.మ. రైల్వే పరిధి నుంచి మరో 10 రైళ్లు
ద.మ.రైల్వే పరిధి నుంచి వచ్చిపోయే 18 రైళ్లకు అదనంగా మరో 10 రైళ్లు(5 జతలు) రాకపోకలు సాగించనున్నాయి. వీటిలో ముంబయి-భువనేశ్వర్‌-ముంబయి (నం.01019, 01020), ముంబయి-కేఎస్‌ఆర్‌ బెంగళూరు-ముంబయి (01301, 01302), దానాపూర్‌-కేఎస్‌ఆర్‌ బెంగళూరు-దానాపూర్‌ (02295, 02296), న్యూదిల్లీ-విశాఖపట్నం-న్యూదిల్లీ (02805, 02806), హావ్‌డా-యశ్వంత్‌పూర్‌-హావ్‌డా (02245, 02246) రైళ్లు ఉన్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.
టికెట్ల రుసుం వాపసు 25 నుంచి
లాక్‌డౌన్‌ నాటి నుంచి రద్దయిన రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్‌ టికెట్ల రిఫండ్‌ రుసుముల్ని సోమవారం(25వ తేదీ) నుంచి చెల్లించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం పీఆర్‌ఎస్‌ కౌంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కౌంటర్‌ టికెట్లు తీసుకున్నవాళ్లు ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల్లోపు రిఫండ్‌ పొందొచ్చని ద.మ.రైల్వే పేర్కొంది. తగినంత సమయం ఇచ్చినందున ఒకేసారి రావద్దని, కౌంటర్ల వద్ద గుంపులుగా చేరొద్దని విజ్ఞప్తి చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.