close

తాజా వార్తలు

శ్వేతసౌధంలో ఏకాకి!

ఒంటరి జీవితం గడుపుతున్న అమెరికా ప్రథమ మహిళ మెలనియా!!
సంచలన నిజాలు బయటపెట్టిన కొత్త పుస్తకం

ఆమె ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ప్రథమ మహిళ. శ్వేతసౌధానికి పట్టపురాణి! సుసంపన్నుడైన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి. అధ్యక్షుడి భార్య హోదాలో మెలనియా వైట్‌హౌస్‌లో సమస్త రాజభోగాల్ని అనుభవిస్తున్నారని అనుకుంటాం. కానీ దీనికి పూర్తి భిన్నమైన జీవితాన్ని ఆమె ప్రస్తుతం అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది!! ఒకరకంగా ఆమె వైట్‌హౌస్‌లో ఒంటరి జీవితం గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఎడమొహం పెడమొహంగా గడుపుతారు. ట్రంప్‌ మొదటిభార్య కుమార్తె ఇవాంకాతోనూ మెలనియాకు సత్సంబంధాల్లేవు. అధ్యక్ష భవనంలో తన పాత్ర విషయంలో ఇవాంకతో ఆమె చాలాసార్లు విభేదించారు కూడా. ఏ అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ప్రథమ మహిళ పక్కన కనిపించేవారు. కానీ ట్రంప్‌ పక్కన మెలనియా అత్యంత అరుదుగానే కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించినా ఎడమొహం పెడమొహంగానే!! విదేశాలకు, అధికారిక కార్యక్రమాలకు చాలావరకు ట్రంప్‌ ఒక్కరే వెళతారు. గత ఏడాది అనారోగ్యంపాలైన మెలనియా దాదాపు మూత్రపిండాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయారట! ‘‘ఫ్రీ మెలనియా- ద అనాథరైజ్డ్‌ బయోగ్రఫీ’ పేరుతో సీఎన్‌ఎన్‌ పాత్రికేయురాలు కేట్‌ బెనెట్‌ రాసిన పుస్తకంలో ఈ సంచలన వాస్తవాలు బయటపెట్టారు. వైట్‌హౌస్‌ పాత్రికేయ సిబ్బందిలో ఒకరైన కేట్‌ బెనెట్‌ ఎక్కువగా మెలనియా వ్యక్తిగత విషయాల్ని కవర్‌ చేస్తుంటారు. స్లొవేనియాలో పుట్టిపెరిగినప్పటి నుంచి ప్రస్తుతం వైట్‌హౌస్‌లో పోషిస్తున్న పాత్ర దాకా మెలనియా జీవితంలోని అన్ని కోణాల్నీ గత మంగళవారం విడుదలైన 288 పేజీల ఈ పుస్తకం తడిమిచూసింది. ‘అత్యంత ప్రైవేటు జీవితం’ గడుపుతున్న మొట్టమొదటి ప్రథమ మహిళ మెలనియానేనని పుస్తకం విశ్లేషించింది. ఈ పుస్తకం బయటికి వచ్చినప్పటి నుంచి మెలనియా తన సొంత ఇంట్లోనే బందీగా గడుపుతున్నారంటూ సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి.

 


వేర్వేరు గదుల్లో నిద్ర

ట్రంప్‌, మెలనియాలు వైట్‌హౌస్‌లోని వేర్వేరు అంతస్తుల్లో, వేర్వేరు గదుల్లో నిద్రిస్తారని పుస్తకం బయటపెట్టింది. ట్రంప్‌ రెండో అంతస్తులో, మెలనియా మూడో అంతస్తులో పడుకుంటారని, ట్రంప్‌ తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతారని పుస్తకం వివరించింది. మూడో అంతస్తులో మెలనియా కోసం రెండు వేరే గదులున్నాయి. గత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్త మరియన్‌ రాబిన్‌సన్‌ ఆ గదుల్లో ఉండేవారు. మెలనియా మేకప్‌ చేసుకోవడానికి ఒక అలంకరణ గది ఉంది. ఆమె కోసం ప్రైవేటు జిమ్‌ కూడా ఉంది.


ఇవాంక పొడ గిట్టదు!

అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌ తర్వాత అంతటి శక్తిమంతమైన వ్యక్తి ఆయన కుమార్తె ఇవాంక. ట్రంప్‌ సలహాదారుగా ఆయన వెంట విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. దేశంలో మహిళా సంబంధ విషయాలనూ ఆమే చూసుకుంటారు. గత అధ్యక్షుల కాలంలో ఈ పనుల్ని ప్రథమ మహిళ చూసేవారు. ఇప్పుడు ఆ పనుల్లోకి ఇవాంక చొచ్చుకురావడం, ఓవల్‌ ఆఫీస్‌(అధ్యక్షుడి కార్యాలయం)లో క్రియాశీలంగా మెలగడం మెలనియాకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఈ విధుల విషయంలో ఇవాంక, మెలనియాల మధ్య పెద్ద సంఘర్షణే నడుస్తోందని పుస్తకం బయటపెట్టింది. ‘‘ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ’ అని రాసిన జాకెట్‌ను మెలనియా 2018లో ధరించారు. ఈ రాతలు ఇవాంకను ఉద్దేశించే అన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ ఆ జాకెట్‌ సందేశం మీడియాను ఉద్దేశించినది అని ఆ తర్వాత వైట్‌హౌస్‌తో పాటు మెలనియా వివరణ ఇచ్చారు. భర్త ట్రంప్‌ తుంటరి అలవాట్లను ప్రస్ఫుటించే సందేశాలుండే దుస్తుల్ని మెలనియా గతంలో చాలాసార్లు ధరించారు. మెలనియా, ఇవాంక మధ్య బంధం ‘సాదరమే తప్ప సన్నిహితం కాదు’ అని పుస్తకం విశ్లేషించింది.


వైట్‌హౌస్‌ పనుల్లో గడుపుతూ..

మెలనియా ప్రస్తుతం వైట్‌హౌస్‌లో చిన్న చిన్న పనుల్ని పర్యవేక్షిస్తూ పూర్తి వ్యక్తిగత జీవితం గడుపుతున్నారు. వైట్‌హౌస్‌లో క్రిస్‌మస్‌ అలంకరణల్లాంటి పనులు చూస్తున్నారు. సెలవురోజుల్లో వైట్‌హౌస్‌లో చేసే సంబరాలు, అతిథులకు ఆహ్వానం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సతీమణి కారెన్‌ పెన్స్‌తో కూడా మెలనియాకు సఖ్యత లేదని పుస్తకం వివరించింది.


కొడుకే ముఖ్యం

డొనాల్డ్‌ ట్రంప్‌, మెలనియాలకు 13 ఏళ్ల కుమారుడు బారెన్‌ ఉన్నాడు. ప్రస్తుతం తన ప్రాధాన్యం అతని భవిష్యత్తేనని మెలనియా చెబుతుంటారు. బారెన్‌ గురించిన ప్రస్తావన పుస్తకంలో ఎక్కువగా లేదు. చిన్నపిల్లాడి గురించి బహిరంగ చర్చ జరగకూడదనే తాను ఈ పనిచేసినట్లు పుస్తక రచయిత చెప్పుకొచ్చారు.


టీవీల్లో కనిపించరు

మెలనియా అత్యంత అరుదుగానే టీవీ ఇంటర్వ్యూలు ఇస్తారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టాక.. ఇంతవరకు ఏ ప్రధాన మేగజీన్‌ కవర్‌పేజీ పైనా కనిపించలేదు. మెలనియా సోషల్‌ మీడియా అకౌంట్లను ఆమె సిబ్బంది నిర్వహిస్తుంటారు.

 

-ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.