close

ప్రధానాంశాలు

బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీలకు పంపడం కుదరదు

దస్త్రాన్ని మళ్లీ ఛైర్మన్‌కు తిప్పి పంపిన కార్యదర్శి

ఈనాడు, అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై ఏపీ శాసనమండలి సెలక్ట్‌ కమిటీల నియామకం వ్యవహారం జటిలంగా మారుతోంది. ఆ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీలకు పంపిస్తూ బులెటిన్‌ జారీచేసేందుకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నిరాకరించారు. బులెటిన్‌ జారీ చేయాలని మండలి ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ పంపించిన దస్త్రాన్ని ఆయన శుక్రవారం మరోసారి తిప్పి పంపారు. ఆయన ఇలా పంపడం ఇది రెండోసారి.

ఎందుకు వీలు కాదంటే?
దస్త్రాన్ని మండలి ఛైర్మన్‌కి తిప్పి పంపుతూ.. బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీలకు పంపడం ఎందుకు సాధ్యం కాదో వివరిస్తూ శాసనసభ కార్యదర్శి ఒక నోట్‌ రాశారు. ‘బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపడం అన్నది.. బిల్లును ఆమోదించాలని సభలో మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సవరణ ప్రతిపాదించడం ద్వారా జరగాలి. అది రాజ్యాంగం 189వ అధికరణలోని ఒకటో నిబంధన ప్రకారం జరగాలే తప్ప.. సభ మూడ్‌ని బట్టి, లేదా ఏకాభిప్రాయాన్ని బట్టి కాదు. సభా కార్యకలాపాల నిర్వహణలో ఛైర్మన్‌కి మార్గదర్శనం చేయడం, తోడ్పడటం కార్యదర్శి విధి. నిబంధనల అమలులో లోపాలుంటే దాన్ని తెలియజెప్పడాన్ని ధిక్కారంగా భావించరాదు’ అని ఛైర్మన్‌కి పంపిన నోట్‌లో కార్యదర్శి పేర్కొన్నట్టు సమాచారం. సెలక్ట్‌ కమిటీని నియమించాల్సింది సభేనని, దానిలో అధికార యంత్రాంగం వైఫల్యం లేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ రెండు బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీలకు పంపించాలన్న నిర్ణయానికి సంబంధించి.. మండలిలోని సభ్యుల మెజార్టీ అభిప్రాయం ప్రతిబింబించలేదని, ఆ నిర్ణయం నిబంధనల ప్రకారం జరగలేదని కార్యదర్శి అభిప్రాయపడినట్టు సమాచారం. ఆ అంశంపై తాను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేనని కార్యదర్శి స్పష్టం చేసినట్టు తెలిసింది.

కోర్టుకు వెళ్లే యోచనలో తెదేపా
బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీలకు పంపుతూ బులెటిన్‌ జారీ చేసేందుకు శాసనసభ కార్యదర్శి నిరాకరించడంతో ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలా? శాసనసభ కార్యదర్శికి సభా ధిక్కరణ నోటీసు ఇచ్చి, చర్యలు చేపట్టాలా? అన్న అంశంపై తెదేపా యోచిస్తోంది. సెలక్ట్‌ కమిటీల దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిపై సభ్యులు ఎవరైనా నోటీసు ఇవ్వచ్చని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. క్రమశిక్షణ రాహిత్యం కింద కార్యదర్శిపై కఠినచర్యలు తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందన్నారు. దీనిపై పార్టీపరంగా ఏం చేయాలన్నదీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.