close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జేజే ఆసుపత్రికి వరవరరావు

ఈనాడు, హైదరాబాద్‌- ముంబయి: ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజాకవి వరవరరావును సోమవారం రాత్రి అక్కడి జేజే ఆసుపత్రిలో చేర్పించారు. బీమా కొరేగావ్‌ కేసులో అరెస్టయి 22 నెలలుగా  జైలులో ఉన్న వరవరరావును మే నెలలో జేజే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, చికిత్స పూర్తికాకముందే మళ్లీ జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత  క్షీణించింది. దీంతో ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, వెంటనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు డిమాండ్‌ చేయడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈసారైనా వరవరరావుకు పూర్తి చికిత్స ఇప్పించాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ హరగోపాల్‌, కోకన్వీనర్లు గడ్డం లక్ష్మణ్‌, రాఘవచారి, రాంచందర్‌, అనిత డిమాండు చేశారు. వరవరరావు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరోగ్య బులెటిన్లు  విడుదల చేయాలని, ఆయనను  కలిసేందుకు కుటుంబ  సభ్యులను అనుమతించాలని ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.

బెయిల్‌ మంజూరు చేయండి: తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేనందున తాత్కాలిక బెయిల్‌ ఇవ్వాలని వరవరరావు ముంబయి హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. జూన్‌ 2న జేజే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సమయంలో ఇచ్చిన వైద్య రికార్డులను తనకు అందజేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని న్యాయవాది ద్వారా దాఖలు చేసిన మరో పిటిషన్‌లో వరవరరావు అభ్యర్థించారు.

వరవరరావుని తక్షణం విడుదల చేయాలి: ముంబయి జైలు నుంచి వరవరరావుని తక్షణం బెయిల్‌పై విడుదల చేయాలని సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, విద్యార్థులు, న్యాయవ్యాదులతో కూడిన పౌర బృందం విజ్ఞప్తి చేసింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నందున వెంటనే విడుదల చేయాలని 2 వేల మందితో కూడిన ఈ బృందం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 


వరవరరావును హైదరాబాద్‌కు తరలించాలి
విద్యావేత్త చుక్కా రామయ్య విజ్ఞప్తి

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కవి, సామాజిక ఉద్యమకారుడు వరవరరావును మానవీయ కోణంలో ఆలోచించి జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య విజ్ఞప్తి చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చి, జీవిత చరమాంకంలో ఆయనకు కుటుంబంతో గడిపే అవకాశం కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపాలన్నారు. ఇంకా వరవరరావు విడుదలను కోరుతూ, అందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ కృషి చేయాలని, ఆయనకు మెరుగైన వైద్యసేవలందించాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తదితరులు కోరారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.