close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్నపూర్ణ భారత్‌లో ఆకలి మంటలూ అధికమే!

  ప్రపంచ ఆకలి సూచీలో మన దేశానికి 94వ ర్యాంకు
గత ఏడాది కంటే 8 స్థానాలుపైకి..

దిల్లీ: దేశ పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వటంలేదని ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌- జీహెచ్‌ఐ)2020 స్పష్టంచేస్తోంది. దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ క్షుద్బాధ, పోషకాహార లోపాలు వంటివి చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. 107 దేశాల జాబితాతో వెలువడిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 94వ స్థానంలో ఉంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో నిలిచింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌ ఇదే విభాగంలో ఉన్నప్పటికీ..మన కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. అఫ్గానిస్థాన్‌ మనకన్నా దిగువ స్థాయిలో ఉంది.
గత ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో 117 దేశాల వివరాలు వెల్లడి కాగా అప్పుడు మన దేశం 102వ స్థానంలో ఉంది. అంటే క్షుద్బాధ నివారణలో గత ఏడాది 101 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే... ఈ ఏడాది అటువంటి దేశాల సంఖ్య 93కి తగ్గింది. 8ర్యాంకుల మేరకు మనదేశ పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఈ అంశంలో సాధించాల్సింది ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. పథకాల అమలులో వైఫల్యాలు, పర్యవేక్షణ కొరవడటం, పోషకాహార లోపాలను సరిదిద్దలేకపోవటం, పెద్ద రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరచక పోవటం వంటివి మన దేశం వెనుకబాటుకు కారణాలుగా ఉన్నాయని విశ్లేషించారు.
* చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ తదితర 17 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆకలి సూచీ వెబ్‌సైట్‌ వెల్లడించింది.
* మనదేశ ప్రజల్లో 14 శాతం మంది పోషకాహార లోపాలకు గురైనవారున్నారని నివేదిక చెబుతోంది.
* దేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువులేని వారు 17.3శాతం కాగా... బరువు తక్కువ ఉన్న అయిదేళ్లలోపు పిల్లలు 37.4 శాతం. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో మరణాలు 3.7శాతం. ఈ అంశాలన్నీ పౌష్టికాహార లోపాన్నే సూచిస్తున్నాయి.
* 1991-2014 మధ్య కాలానికి సంబంధించిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌, భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లు బాలల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు తీసుకున్నాయి. ఈ సమయంలో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో మరణాల రేటును భారత్‌ గణనీయంగా తగ్గించుకోగలిగింది. అయితే, అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
* పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ల పనితీరు మెరుగుపడితేనే ఆకలి సూచీ ర్యాంకింగ్‌లో మనదేశం అగ్రభాగం దిశగా ముందుకెళ్లగలదని అంతర్జాతీయ ఆహార విధానాల పరిశోధన సంస్థ సీనియర్‌ పరిశోధకురాలు పూర్ణిమా మేనన్‌ అభిప్రాయపడ్డారు.
ఆకలి సూచీల ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకున్న అంశాలు...
పౌష్టికాహారలోపం, చిన్నారులు ఎత్తుకుతగిన బరువు లేకపోవటం, అయిదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపాలు, వయసుకు తగిన బరువులేకపోవటం, శిశుమరణాల రేటు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.