close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దివికేగిన సాహితీ ‘సింగం’

విమర్శకుడు, కథకుడిగా సింగమనేని నారాయణ సేవలు విశిష్టం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు సింగమనేని నారాయణ అనారోగ్యంతో గురువారం అనంతపురంలో కన్నుమూశారు. ఐదు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు బండమీదపల్లిలో 1943 జూన్‌ 26న రైతు కుటుంబంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు నారాయణ జన్మించారు. ఆయన 32 సంవత్సరాలు అనంతపురం జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితుడిగా పనిచేశారు.
17ఏళ్ల వయసులోనే తొలి కథ
సింగమనేని నారాయణ 1960లో తన మొదటి కథ ‘న్యాయం ఎక్కడ?’ రచించారు. 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు-అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలు రాశారు. తర్వాతి కాలంలో కాల్పనిక రచనల వల్ల సమాజానికి ఒనగూరేదేమీ లేదని గ్రహించి తార్కిక రచనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే జూదం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, సీమ కథలు, అనంతం, ఇనుపగజ్జెల తల్లి వంటి రచనలు చేశారు. ‘నా సాహిత్య శిల్పాన్ని ప్రభావితం చేసింది కొడవటిగంటి కుటుంబరావు, నా మానసిక దృక్పథాన్ని మార్చింది శ్రీశ్రీ’ అని సింగమనేని చెప్పేవారు. తొలుత శ్రీశ్రీ మాదిరిగానే ప్రేమ నవలలు రాసినా... తర్వాత సంపూర్ణ మార్క్సిస్టుగా మారి ఆ భావజాలంతో రచనల్ని కొనసాగించారు. సింగమనేని నారాయణను తెలుగుసాహిత్యంలో విలక్షణ రచయితగానే కాక గొప్ప పాఠకుడిగానూ సాహితీవేత్తలు అభివర్ణిస్తారు. రాయలసీమ రచయితల కథలను సంకలనం చేయడంలో వీరి కృషి ప్రత్యేకమైనది. సాహితీ రంగంలో సింగమనేని చేసిన కృషికి 1997లో ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం వారు ‘అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం’ అందజేసింది. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.
 అరసం సంతాపం
ఈనాడు, హైదరాబాద్‌: సింగమనేని నారాయణ మరణంతో తెలుగు సాహితీలోకం పెద్ద దిక్కును కోల్పోయిందని అరసం అభిప్రాయపడింది. సీమాంధ్రులు, విశాలాంధ్ర కథలు, తెలుగు కథకులు, కథానురీతులు తదితర గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించడంతోపాటు కథావరణం, సమయమూ సందర్భము, సంభాషణ, తెలుగే ఎందుకు, మధురాంతకం రాజారాం వంటి గ్రంథాలను రచించిన ఆయన తెలుగు కథా వికాసానికి దోహదం చేశారని పేర్కొంది. ఆయన మృతి పట్ల అరసం సంతాపం ప్రకటించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు