close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా

నిందితులను విచారిస్తున్న పోలీసులు
నామినీలు, వైద్యులు, పోలీసుల పాత్రపైనా ఆరా

ఈనాడు నల్గొండ - న్యూస్‌టుడే దామరచర్ల, మిర్యాలగూడ: ఇదో బీమా మాఫియా! అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే కుటుంబానికి ఆసరా కోసం జీవిత బీమా చేయించుకుంటారు ఎవరైనా!! కాని ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. అమాయకులకు తెలియకుండానే పాలసీలు చేయించడం.. తర్వాత వారిని హతమార్చడం.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం.. నామినీల సాయంతో బీమా సొమ్మును కొట్టేయడం. దాదాపు ఏడేళ్లుగా గుట్టుగా సాగిపోతున్న ఈ దందాలో ఇప్పటి వరకు 10 మంది వరకు అమాయకుల్ని మట్టుబెట్టడం ఆందోళనకరం. మారుమూల తండాల్లోని నిరుపేదల పేరుతో రూ. లక్షల్లో పాలసీలు తీసుకుంటున్నా.. కొద్దినెలల్లోనే వారిపై క్లెయిమ్‌లు వస్తున్నా బీమా సంస్థలు వాటి గురించి ఆరా తీయకపోవడానికి కారణాలేంటి?
అతి సామాన్యుల పేరిట లక్షల రూపాయల బీమా సొమ్ము జమ అయినా.. కొద్దినెలల్లోనే అంత పెద్ద మొత్తం చేతులు మారుతున్నా బ్యాంకులు ఎందుకు అనుమానించలేదు?
ఒకే మండలంలో తరచుగా రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నా పోలీసులు ఎందుకు పెద్దగా దృష్టి పెట్టలేదు?
అమాయకులను హతమార్చి రోడ్డు ప్రమాదాలంటూ శవాలను తెస్తున్నా శవపరీక్ష చేసిన వైద్యులు దానినే ఎలా నిర్ధారించారు? ఇవన్నీ తేలాల్సిన అంశాలు.
మారుమూల గిరిజన తండాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారి పేరుతో ప్రీమియం కట్టి అనంతరం బీమా డబ్బుల కోసం హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న ముఠా దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించిందని నల్గొండ పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులు ఏడేళ్ల నుంచి దామరచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాచేపల్లి, మాచర్ల, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో పదిమందిని ఇలా హత్య చేసినట్లు తెలిసింది. ఈ ముఠాలో దామరచర్ల మండలానికి చెందిన ఓ ఏజెంటుతో పాటు మాచర్లకు చెందిన ఏజెంటు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ దందాతో సంబంధం ఉన్న 20 మంది నిందితులను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. మంగళవారం ‘ఈనాడు’లో ‘బీమాసురులు’ శీర్షికతో ప్రచురితమైన కథనం ఆధారంగా నిందితులను విచారించగా.. పత్రికలో వచ్చిన అన్ని విషయాలను వారు అంగీకరించారని కేసు విచారణలో కీలకంగా ఉన్న ఓ అధికారి వెల్లడించడం గమనార్హం. ఈ ముఠా తొలుత 2013లో గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వ్యక్తిని హత్య చేయగా అక్కడి పోలీసులు బీమా కోసమే ఇలా చేశారని తేల్చారు. దీంతో నిందితులు గిరిజన ప్రాంతాలున్న దామరచర్ల, మాచర్ల, ఒంగోలు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు ఏడుగురిని హతమార్చామని అంగీకరించినట్లు సమాచారం.

స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ
సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న వైద్యులు, పోలీసులు, బ్యాంకర్ల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో బీమా ప్రీమియం చెల్లించి ఏడాది లోపే పాలసీలు క్లెయిమ్‌ చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. పలువురు నామినీలను మంగళవారం నల్గొండకు పిలిపించి విచారించినట్లు తెలిసింది. పాలసీ క్లెయిమ్‌లకు ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు కీలకం కావడంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చిన అప్పటి పోలీసులను, వైద్యులను విచారించనున్నట్లు తెలిసింది. మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతేడాది జరిగిన రెండు అనుమానాస్పద మరణాల్లో వైద్యులు శవ పంచనామా నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ ఇచ్చారు. వాటిలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

నేడు నల్గొండకు ఏపీ నుంచి అనుమానితులు
నల్గొండకు చెందిన ఓ ఉద్యోగి క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించి బీమా సంస్థలకు అనుసంధానంగా ఉన్నారు. ఆయన పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏపీ నుంచి కొంతమందిని బుధవారం నల్గొండకు తీసుకురానున్నట్లు తెలిసింది. క్లెయిమ్‌ల కింద బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు పొందిన ఏజెంట్లు, ఇతరుల ఖాతాలకు బదిలీ చేసిన కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దైద హుస్సేన్‌ బతికున్నా మరణించినట్లు 2017లో బీమా క్లెయిమ్‌ చేశారు. థర్డ్‌ పార్టీ వారు విచారణ సమయంలో అనుమానం రావడంతో నామినీని విచారించగా ఏజెంటు సలహాతోనే తానీ పనిచేసినట్లు ఒప్పుకొంది. దీనిపై వాడపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతో నిందితులు తప్పించుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో ఇదే ఠాణాలో పలు కేసులు నమోదైనా విచారణలో శ్రద్ధ చూపించలేదన్న ఆరోపణలున్నాయి.


ఇద్దరు ఏజెంట్లు.. గుట్టలకొద్దీ ఆస్తులు

దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఏజెంట్లు గత నాలుగైదేళ్లలో దాదాపు రూ. 50 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రాళ్లవాగుతండా, మిర్యాలగూడ, హైదరాబాద్‌, మాచర్ల, ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో నిందితుల ఇళ్ల నుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దామరచర్లకు చెందిన ఓ ఏజెంటు మిర్యాలగూడలో రూ. కోట్ల విలువ చేసే రెండు భవంతులతో పాటు వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ పరిసరాల్లో 10 వరకు ప్లాట్లు, గుంటూరు, మాచర్లలో అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు విచారణలో వెల్లడించారని సమాచారం. మాచర్లకు చెందిన మరో ఏజెంటుకు గుంటూరు, ఒంగోలులోని విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు తెలిసింది.


ఖాతాదారుకు తెలియకుండా 10 పాలసీలు

ప్రైవేటు ఉద్యోగికి తెలియకుండానే అతనిపై 10 జీవిత బీమా పాలసీలు చేయించిన వైనం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం తాజాగా వెలుగుచూసింది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన కందుకూరి భాస్కర్‌కు చెందిన ఎస్‌బీఐ పొదుపు ఖాతా నుంచి గతేడాది డిసెంబరులో తనకు తెలియకుండానే కొంత సొమ్ము చెల్లింపులు జరిగినట్లు సమాచారం వచ్చింది. భాస్కర్‌ బ్యాంకు అధికారులను సంప్రదించగా జీవిత బీమా కార్యాలయంలో పది పాలసీలకు నగదు చెల్లింపు జరిగిందని తేలింది. ఆ కార్యాలయంలో ఆరా తీస్తే బీమా ఏజెంట్‌ వీరమళ్ల శ్రీనివాస్‌, డీవో చిలుక సైదయ్య ఈ బీమాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరమళ్ల శ్రీనివాస్‌ గుంటూరు జిల్లా చిలుకలూరి పేటలో నివాసం ఉంటుండగా, చిలుక సైదయ్య నల్గొండలో నివాసముంటున్నారు. బాధితుడు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించి తనకు తెలియకుండానే పాలసీలు చేయించారని, బ్యాంకులో కేవైసీ మార్పు చేయటంతో పాటు మరో ఏటీఎం కార్డు పొందారని, బ్యాంకు సిబ్బందిపైనా అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. బీమా ఏజెంట్‌, డీవోపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు