close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బందీగా ఉన్న జవాను సురక్షితం

చిత్రం విడుదల చేసిన మావోయిస్టులు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: తమ చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మిన్హాస్‌ ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌-సుకమా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానును మావోయిస్టులు అపహరించిన విషయం విదితమే. ఆయన తమ చెరలో ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన మావోయిస్టులు బుధవారం ఆయన ఫొటోను పత్రికలకు పంపించారు. ఓ పూరిపాకలో మిన్హాస్‌ క్షేమంగా ఉన్నట్లు ఇందులో కనబడుతోంది. ప్రభుత్వం మధ్యవర్తులను ప్రకటిస్తే జవానును సురక్షితంగా తిరిగి పంపిస్తామని మావోయిస్టులు మరోసారి ప్రకటించారు. తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు ప్రకటించారు. రాకేశ్వర్‌సింగ్‌ తమవద్ద సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఆయనను విడుదల చేస్తామని తెలిపారు. ఈమేరకు బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో ఓ మీడియా ప్రతినిధి సమక్షంలో ప్రకటించారు.

జమ్మూలో ప్రదర్శన
జమ్మూ: కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మిన్హాస్‌ సురక్షిత విడుదలకు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బుధవారం జమ్మూలో ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ-పూంఛ్‌ జాతీయ రహదారిని వారు స్తంభింపజేశారు. ‘‘జవానును విడిపించడం ప్రభుత్వ బాధ్యత. ఆయన సురక్షితంగా మా వద్దకు చేరుకునేలా సర్కారు తక్షణ చర్యలు చేపట్టాలి. విడుదలకు ఏయే చర్యలు తీసుకుంటున్నదీ మాకు తెలపాలి’’ అని మిన్హాస్‌ సతీమణి మీను కోరారు.
ప్రభుత్వం నుంచి సమాచారమే లేదు
‘‘ఏ జవానైనా సెలవు తర్వాత ఒక్కరోజు విధి నిర్వహణకు ఆలస్యమైనా చర్యలు తీసుకుంటారు. నా భర్త ఆచూకీ శనివారం నుంచి తెలియడంలేదు. ప్రభుత్వం నుంచి గానీ, సీఆర్పీఎఫ్‌ నుంచి గానీ ఎలాంటి సమాచారం మాకు లేదు. ఏదైనా మీడియా ద్వారానే తెలుసుకుంటున్నాం’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు, ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు ఫోన్‌ ద్వారా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌తో మిన్హాస్‌ తల్లి కుంతీదేవిని మాట్లాడించారు. కుమారుడిని ఎలాగైనా విడిపించి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు