close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
20 లక్షలు దాటిన క్రియాశీల కేసులు

ఒక్క రోజులో 1,761 మంది మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర ఉద్ధృతి నేపథ్యంలో క్రియాశీల (యాక్టివ్‌) కేసుల సంఖ్య మంగళవారం 20 లక్షలు దాటింది. ఒక్క రోజులో 1,761 మంది కొవిడ్‌ బాధితులు కన్నుమూశారు. ముందు రోజు కంటే మరణాలు 8.77% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వారాంతపు రోజుల్లో పరీక్షలు తగ్గుతూ వస్తుండటంతో ఆ ప్రభావంతో కొత్త కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ.. 24 గంటల్లో 2,59,170 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుకంటే ఇది 5.6% తక్కువ. ప్రతి మంగళవారం కొత్త కేసుల నమోదులో కొంత తగ్గుదల కనిపించడం సహజంగా వస్తోంది. ఇదే తరహాలో ఈనెల 6న 9.24%, 13న 4.24% కేసులు తగ్గాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.53 కోట్లు దాటింది. కరోనా బారిన పడినవారిలో ఇంతవరకు 1,31,08,582 మంది కోలుకున్నారు.
* దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 20,31,977 (13.26%)కి పెరిగింది. దీంతో ఆసుపత్రులపై మరింత ఒత్తిడి పెరగనుంది. మొత్తం క్రియాశీలక కేసుల్లో 14.79 లక్షలు (72%) ఏప్రిల్‌ నెలలోనే నమోదయ్యాయి.
* దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఏప్రిల్‌ 1న 5.95% ఉన్న పాజిటివ్‌ రేటు 20వ తేదీ నాటికి 15.99%కి పెరిగింది. 24 గంటల్లో 1,54,761 మంది కోలుకోగా కొత్త కేసుల సంఖ్య భారీగా ఉండటంతో రికవరీ రేటు 85.56 శాతానికి పడిపోయింది.
* మొత్తం మరణాల సంఖ్య 1,80,530కి చేరగా మరణాల రేటు 1.18%కి చేరింది.
* దేశవ్యాప్తంగా ఇంతవరకు 26.94 కోట్లకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈనెల 19న 15,19,486 శాంపిళ్లను పరీక్షించారు.
* ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో (351) నమోదయ్యాయి. దిల్లీలో తొలిసారి మరణాలు 240 మేర నమోదయ్యాయి. ఛత్తీస్‌గడ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ల్లోనూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

బారులు తీరుతున్న అంబులెన్సులు..
గుజరాత్‌లో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వాటివద్ద దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పడకలన్నీ నిండిపోవడంతో ప్రతిచోట పెద్ద వరుసల్లో అంబులెన్సులు కనిపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలోనూ పరిస్థితి దయనీయంగా మారింది.
కొవిడ్‌ బారిన 90 మంది రైల్వే సిబ్బంది
కోల్‌కతాలోని సియాల్దహ్‌ సెక్షన్‌ పరిధిలో 56 లోకల్‌ రైలు సర్వీసులను మంగళవారం రద్దు చేశారు. దాదాపు 90 మంది డ్రైవర్లు, గార్డులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు