close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘దేవరయాంజాల్‌’లో 219 కట్టడాలు

సీతారామచంద్రస్వామి భూములపై విచారణలో ప్రాథమికంగా వెల్లడి
ఏడు గంటలపాటు ఎనిమిది బృందాలతో తనిఖీలు
ఈటల భార్య పేరిట ఉన్న గోదాములూ పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శామీర్‌పేట: హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణలను గుర్తించేందుకు ఐఏఎస్‌ అధికారుల బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాత్రపై ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు తేల్చేందుకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు అధ్యక్షతన ఐఏఎస్‌ అధికారులు ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, భారతీహోళికేరి, శ్వేతామహంతితో ప్రభుత్వం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూములను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఏడు గంటలపాటు తిరుగుతూ భూముల్లో నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు అక్కడ ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు.

కొత్తగా మరికొన్ని నిర్మాణాలు....
తొలుత అధికారుల బృందం మంగళవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో భూముల వద్దకు చేరుకుంది. ఎనిమిది బృందాలు డిజిటల్‌ సర్వే చేపట్టాయి. ప్రతి బృందంలో తహసీల్దారు స్థాయి అధికారితోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వోలు ఉన్నారు. ఆయా గోదాములలో ఉంటున్న వారి నుంచి వివరాలు సేకరించారు. మొత్తంగా వివాదాస్పద భూముల్లో 219 కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గోదాములను ఈకామర్స్‌, ప్రముఖ వ్యాపార సంస్థల వస్తువులు నిల్వ ఉంచేందుకు వినియోగిస్తున్నారు. కొత్తగా మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నట్లు తేల్చారు. ఆయా భూములు తనఖా పెట్టి గోదాములు నిర్మించడం లేదా ఇతర అవసరాల కోసం బ్యాంకుల నుంచి యజమానులు భారీగా రుణాలు తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మరోవైపు ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిటా అక్కడ గోదాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫారం ప్రకారం వివరాల సేకరణ
ఆలయ భూములుగా పేర్కొంటున్న 1,500 ఎకరాలను పరిశీలించారు. గత 70 ఏళ్లుగా అందుబాటులో ఉన్న పహాణీలు పరిశీలించారు. రెవెన్యూ, దేవదాయ శాఖ నుంచి భూముల చిత్రపటాన్ని తీసుకుని సర్వే నంబరు వారీగా పరిశీలించారు. అందులో ఉన్న కట్టడాల వివరాలను సేకరించారు. అక్కడ గోదాముల యజమాని లేదా కిరాయిదార్లతో మాట్లాడారు. గోదాము లేదా కట్టడం నిర్మించిన విస్తీర్ణం.. ఖాళీ స్థలం ఎంతెంత ఉంది? అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? యజమాని ఎవరు? అద్దెకు ఉంటున్నదెవరు? ఎంత అద్దె చెల్లిస్తున్నారు... ఇలా సమగ్ర వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 3.40 గంటల వరకు నలుగురు ఐఏఎస్‌ అధికారులు అక్కడే ఉండి పరిశీలించారు. వారు వెళ్లిపోగా.. మిగిలిన రెవెన్యూ అధికారుల బృందం రాత్రి వరకు నిర్మాణాల వివరాలు సేకరించింది. సర్వే వివరాలు అడిగేందుకు విలేకరులు ప్రయత్నించగా, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు మాట్లాడేందుకు నిరాకరించారు. బుధ లేదా గురువారంతో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
ఏసీబీ, విజిలెన్స్‌ తనిఖీ ఇలా..
ఆక్రమణల్లో లోతుపాతులను తెలుసుకునేందుకు మరోపక్క ఏసీబీ, విజిలెన్స్‌ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో, తూంకుంట మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు. ఆలయ భూముల్లో ఎన్ని కట్టడాలున్నాయి? వాటికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎప్పుడు జారీ చేశారు? ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి అనే విషయాలు పరిశీలించారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. మున్సిపాలిటీ అయ్యాక కూడా నిర్మాణాలు కొనసాగినట్లు తేల్చారు. మొత్తం కట్టడాల నుంచి ఏటా తూంకుంట మున్సిపాలిటీకి రూ.3.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయా కార్యాలయాల్లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు