High Court సూచనపై యోచిస్తాం...
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

High Court సూచనపై యోచిస్తాం...

పూర్తి లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగం లేదు
రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉంది
ఔషధాలు, ఆక్సిజన్‌, నిత్యావసరాలకు కొరత లేదు
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అది సమస్యకు పరిష్కారం కాదని, ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, దిల్లీలో లాక్‌డౌన్‌ కారణంగానే టెస్టింగు కిట్లు దొరకడం లేదన్నారు. స్థానిక అవసరాలను బట్టి పొరుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. హైకోర్టు చెప్పిన వారాంతపు లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, కేసుల సంఖ్య తక్కువేనన్నారు. వ్యాధి నివారణకు వైద్య, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని, త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. అవసరాల మేరకు వైద్యసిబ్బందిని నియమిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినా, నిత్యం తమతో సమీక్షలు చేశారని సీఎస్‌ వెల్లడించారు. కొవిడ్‌ నియంత్రణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధాలు, పడకలు, ఆక్సిజన్‌, నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేసిన వారే ఇబ్బంది పడుతున్నారని, సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి టీకాల ప్రక్రియ కొనసాగుతోందని, తగినంత సరఫరా లేకనే 18 నుంచి 44 సంవత్సరాల వారికి ప్రారంభించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను ఏమాత్రం దాచడం లేదన్నారు. బుధవారం బీఆర్‌కేభవన్‌లో ఆయన కరోనా పరిస్థితులపై విలేకరులతో మాట్లాడారు.

దేనికీ కొరత లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం 11 లక్షల కరోనా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెద్దఎత్తున చేస్తున్నాం.
ఇప్పటి వరకు 42 లక్షలకు పైగా టీకాలను అందించాం. 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి అవసరమైన నిల్వలున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 62 వేల ఆక్సిజన్‌ పడకలున్నాయి. సీఎం ఆదేశాలకనుగుణంగా వాటిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలపై ఆడిట్‌ చేస్తున్నాం.
తెలంగాణలో రోజూ 120 టన్నుల ప్రాణవాయువు అవసరమవుతుంది. ఇప్పుడు 400 టన్నులు అందుబాటులో ఉంది. రాష్ట్రానికి రోజుకు 125 టన్నులు సరఫరా కావాల్సి ఉంది. కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన 45 టన్నులు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తెలంగాణకు రావాల్సిన ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పంపమని అడిగాం.
ఇక్కడ మెరుగైన వైద్యం అందడం వల్లే ఇతర రాష్ట్రాల రోగులు వస్తున్నారు. ఆస్పత్రుల్లో ఆ రోగులే అధికం. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.
విమానాల వినియోగం వల్ల ఆక్సిజన్‌ రావడానికి మూడురోజుల సమయం ఆదా అవుతోంది.
అయిదు లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు ఆర్డర్‌
రెమ్‌డెసివిర్‌ వల్ల అంత ఉపయోగం లేదని వైద్యులే చెబుతున్నారు. ప్రజలు మాత్రం దాని కోసం బారులు తీరుతున్నారు. 5 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాం. ప్రస్తుతం 90వేల వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్‌ 63 వేల వయల్స్‌ ఉన్నాయి. అనవసరంగా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌లను దాచిపెట్టుకుంటున్నారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. సాధారణ మందులతో కరోనా తగ్గుతుంది. లక్షణాలుంటే విటమిన్‌ టాబ్లెట్లు, పారాసెట్మాల్‌ తీసుకోవాలి. ప్రతి వేయి ఇళ్లకు ఓ వైద్యబృందాన్ని ఏర్పాటు చేశాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ పేషెంటు సేవలను ప్రారంభించాం. ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌ ఉంటారు. లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. జాగ్రత్తగా ఉండండి. సమస్య నుంచి త్వరలో బయటపడతాం’ అని సీఎస్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు