కొవాగ్జిన్‌ తయారీ అందరికీ సాధ్యం కాదు
close

ప్రధానాంశాలు

కొవాగ్జిన్‌ తయారీ అందరికీ సాధ్యం కాదు

కొవాగ్జిన్‌ టీకా తయారీ కోసం.. దాని సాంకేతికతను వేరేవారికి బదిలీ చేయాలని కొందరు అడుగుతున్నట్లు వీకే పాల్‌ తెలిపారు. అయితే- దాన్ని తయారుచేయడం ఇతరులకు అంత సులభం కాదన్నారు. ‘‘కొవాగ్జిన్‌ సాంకేతికతను బదిలీ చేయడానికి భారత్‌ బయోటెక్‌ సిద్ధంగా ఉంది. ఇందుకు ఎవరైనా ముందుకొస్తే స్వాగతిస్తామని మాతో వారు చెప్పారు. వారి చొరవ వల్లే ప్రభుత్వరంగ సంస్థలైన ఆఫ్కిన్‌, విప్కాల్‌, ఇండియన్‌ ఇమ్యునలాజికల్‌ సంస్థలు ఇప్పుడు ఆ టీకాను ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చాయి. సజీవ వైరస్‌ను నిర్వీర్యం చేసి అద్భుతమైన వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్‌తో కలిసి వారు తయారుచేశారు. అత్యాధునిక బయోసేఫ్టీ లెవల్‌-3 లేబొరేటరీ ఉన్న చోటనే దాని రూపకల్పన సాధ్యమవుతుంది. ఆ లేబొరేటరీలు దాదాపుగా మరే సంస్థ దగ్గరా లేవు. ఏ సంస్థ అయితే టీకాను తయారుచేస్తోందో.. అదే సంస్థ తమతో కలిసిరావాలని మిగిలినవాటికి బహిరంగంగా ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది.  కాబట్టి ఎవరైనాసరే ముందుకురావొచ్చు. అందుకు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. భారత్‌ బయోటెక్‌ పూర్తి సానుకూలతతో చర్యలు తీసుకుంటోంది. తన ఉత్పత్తిని సొంత శక్తితో కోటి నుంచి 10 కోట్ల డోసులకు తీసుకెళ్లే భారాన్ని భుజాలకెత్తుకొంది. ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి ఆ సంస్థ పనిచేస్తోంది. ఆ బంధాలను మేం స్వాగతిస్తున్నాం. అపోహలను తొలగించడానికే నేనీ విషయం చెబుతున్నా. భారత వ్యాక్సిన్‌ కంపెనీలపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వారి కఠోర శ్రమ వల్లే మనం ఎవరిమీదా ఆధారపడకుండా ప్రజలకు టీకా అందించగలుగుతున్నాం. ఆ కంపెనీల కార్మికులు, శాస్త్రవేత్తల ఆత్మస్థైర్యాన్ని మనం దెబ్బతీయకూడదు’’ అని పాల్‌ పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని