ఏ రాష్ట్రం వారైనా రావచ్చు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ రాష్ట్రం వారైనా రావచ్చు

బిహార్‌, దిల్లీ నుంచి కూడా వస్తున్నారు
ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: ఏ రాష్ట్ర రోగులైనా తెలంగాణలో చికిత్స పొందడానికి ఇక్కడికి రావచ్చని, ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే దాదాపు 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండి ఉన్నాయి. బిహార్‌, దిల్లీ నుంచి కూడా వస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారికే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా మెరుగైన చికిత్స అందించాలి కదా. రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌, ఔషధాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని చెప్పడం లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయిస్తున్న ఆక్సిజన్‌ ఏరోజుది ఆ రోజుకే సరిపోతోంది. దీంతో ఆక్సిజన్‌ కేటాయింపులు, వినియోగంపై ఎప్పటికప్పుడు తనిఖీ విధానాన్ని అవలంబిస్తున్నాం. రాష్ట్రంలోని 15-20 ఆసుపత్రుల్లోనే పడకలు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకోసమే ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయో తెలిసేందుకు వీలుగా ఒక డ్యాష్‌బోర్డును తీసుకొచ్చాం. రోగి పరిస్థితిని బట్టి నోడల్‌ అధికారి.. ఆసుపత్రివారితో మాట్లాడి అనుమతిస్తారు. దరఖాస్తు చేసుకున్న కొన్ని నిమిషాలు, గంటల్లోనే అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. దీనికోసం 24 గంటలూ బృందాలు పనిచేస్తున్నాయి. కొవిడ్‌ రెండోదశలో ఆసుపత్రిలో చేరిన రోగి కోలుకోవడానికి 2, 3 వారాలు పడుతోంది. దీంతో పడకల కొరత ఏర్పడుతోంది’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు