Corona: కోలుకున్నా వదలట్లేదా?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కోలుకున్నా వదలట్లేదా?

కొవిడ్‌ తగ్గినా వెన్నాడుతున్న బాధలు
5-10 శాతం మందిలో దీర్ఘకాల ఇబ్బందులు
ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, ఆయాసం, మానసిక ఆందోళనలు
మెదడు, గుండె, ఊపిరితిత్తుల్లో హఠాత్తుగా సమస్యలు
రక్తంలో పెరుగుతున్న చక్కెర స్థాయులు
నిత్యం ఆరోగ్య సంరక్షణ తప్పదంటున్న నిపుణులు

కొవిడ్‌ను జయించినా.. దాని తాలూకు బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. అత్యధికుల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటివి దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఈ లక్షణాలు తగ్గుముఖం పట్టడానికి కొందరికి వారాలు, మరికొందరికి నెలలు పడుతోంది. కరోనాకు ఆలస్యంగా చికిత్స పొందినవారు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఐసీయూలో ప్రాణవాయువు సేవలూ అవసరమవుతున్నాయి. వీరికి స్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి వస్తోంది. కోలుకున్న తర్వాత ఇలాంటి వారిలో సుమారు 5-10 శాతం మందిలో ఏదో రకమైన సమస్య తలెత్తుతోంది. సుమారు 2 శాతం మంది ఆసుపత్రిలో తిరిగి చేరాల్సి వస్తోంది. చికిత్స అనంతరం కొందరిలో ఉన్నట్టుండి మెదడు, గుండె, ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్టెరాయిడ్స్‌ వాడినవారి రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. కరోనా కోరల్లోంచి బయటపడినా.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన తప్పదని వారు సూచిస్తున్నారు.

దీర్ఘకాలం వేధించే సమస్యలు

* 99-100 డిగ్రీల జ్వరం రావడం
* ఒళ్లు నొప్పులు
* తలనొప్పి
* కీళ్ల నొప్పులు
* నీరసం
* అలసట  
* చిన్న విషయాలకే కంగారు పడడం
* ఏకాగ్రత తగ్గడం
* ఆకలి తక్కువగా ఉండడం
* కళ్లు తిరగడం

కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి

* రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92-94 కంటే తగ్గడం
* నడిచినప్పుడు ఆయాసంగా ఉండడం
* చేతులు నీలి రంగులోకి మారడం
* జ్వరం 101 డిగ్రీలు దాటుతుండడం
* తీవ్రమైన దగ్గు నిరంతరంగా బాధిస్తుండడం
* అయోమయ స్థితికి చేరుకోవడం
* మాటలు తడబడడం
* ఛాతీలో పట్టేసినట్లుగా ఉండడం
* భరించలేని తలనొప్పి, వాంతులు
* కళ్ల వాపు, కనుగుడ్డు లాగడం
* కళ్లు మసకబారడం
* కాళ్ల వాపులు
* నోటిపూత
* ఆహారం మింగడంలో ఇబ్బందులు
* మానసిక ఒత్తిడి పెరిగిపోవడం
* నిద్రలేని రాత్రులు గడపాల్సి రావడం

వైరస్‌ను జయించాక ఇలా చేయాలి

* రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంత ఉందో రోజూ పరీక్షించుకోవాలి. 94 శాతం కన్నా తగ్గుతుంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. కాళ్లలో వాపులున్నా, దగ్గు తీవ్రమవుతున్నా, ఛాతీ నొప్పి వచ్చినా వెంటనే   ఆసుపత్రికి వెళ్లాలి.
* శరీరంలో నీరు తగినంత ఉండేలా చూసుకోవాలి. నోరు తడారిపోవడం, మూత్రం మంటగా లేదా చిక్కగా రావడం.. శరీరంలో నీరు తగ్గిందనడానికి సంకేతాలు. దాహం వేసినపుడూ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. అందుకు తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
* కోలుకున్న తరువాత శారీరక శ్రమ ఎక్కువగా చేయకూడదు. గతంలో ఎంత సమయం వ్యాయామానికి కేటాయించేవారో అందులో 30-50 శాతం సమయం కేటాయించాలి. ఈ విధానాన్ని 6-8 వారాల పాటు అనుసరించాలి.
* ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌ తదితర దీర్ఘకాలిక జబ్బులకు వాడుతున్న మందులను యథావిధిగా కొనసాగించాలి.
* తగినంత ప్రొటీన్‌ ఉండేలా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక వేసుకోవాలి. టీవీ, ఫోన్లు చూస్తూ రాత్రిళ్లు 12 లేదా 2 గంటల వరకు మేల్కొనకూడదు. ముఖ్యంగా భయాందోళన కలిగించే, మనసు కలచివేసే దృశ్యాలను చూడకూడదు. ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. పుస్తకాలు చదివేందుకు ప్రాధాన్యమివ్వాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

ఇంటికెళ్లినా అప్రమత్తంగా ఉండాల్సిందే
-డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో ప్రధానంగా శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడుతోంది. కొందరిలో ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘ఫైబ్రోసిస్‌’ అంటారు. ఫైబ్రోసిస్‌ వచ్చిన ప్రాంతం గట్టిపడిపోయి, శ్వాసకోశాల సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. రక్తంలోకి ఆక్సిజన్‌ను పంపించే ప్రక్రియ మందగించి ఆయాసం వస్తుంది. ఎక్కువమందిలో ఈ సమస్యకు తగిన మందులు వాడడం ద్వారా ప్రమాదకరంగా మారదు. ఊపిరితిత్తుల్లో కొంత నష్టం జరుగుతుంది కానీ.. అత్యధికులు కోలుకుంటారు. ఊపిరితిత్తులపై వైరస్‌ ఎంత మేరకు ప్రభావాన్ని చూపిందనే దాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఫైబ్రోసిస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొందరు ఇంటికెళ్లాక కూడా ఆక్సిజన్‌ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీరికి ప్రత్యేకంగా యాంటీఫైబ్రోటిక్స్‌, స్టెరాయిడ్స్‌ అందించాల్సి వస్తుంది. ఈ సమయంలో వారు ఎప్పటికప్పుడూ పల్స్‌ ఆక్సీమీటర్‌తో పరీక్షించుకోవాలి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 93-94 శాతం ఉంటూ.. నడిచినప్పుడు 85-89 శాతానికి పడిపోతుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కొందరిలో ఎన్ని మందులు వాడినా ఫైబ్రోసిస్‌ తగ్గదు. వారిలో శ్వాసకోశాలు పూర్తిగా చెడిపోతాయి. అటువంటి వారికి ఊపిరితిత్తుల మార్పిడి అవసరమవుతుంది.

రక్తం చిక్కబడకుండా మందులు వాడాలి
-డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌, ప్రముఖ గుండె వైద్యనిపుణులు

కొవిడ్‌ బారిన పడినప్పుడు గుండె రక్తనాళాలపై వైరస్‌ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గుండె కండరాల్లో వాపు ఏర్పడుతుంది. రక్తనాళాల్లో పూడిక ఏర్పడి హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే కొవిడ్‌ బాధితుల్లో రక్తం చిక్కబడకుండా మందులు వాడుతుంటారు. అయితే వీరు కోలుకుని ఇంటికి వెళ్లాక కూడా ఈ మందులను వాడాల్సి ఉంటుంది. రక్తపరీక్షల్లో డీ డైమర్‌ ఎక్కువగా ఉన్నవారు కనీసం 4-6 వారాల పాటు రక్తం చిక్కబడకుండా క్రమం తప్పకుండా ఔషధాలను వాడాలి.

మధుమేహాన్ని నియంత్రించుకోవాలి
-డాక్టర్‌ పీవీ రావు, ప్రముఖ డయాబెటాలజిస్ట్‌

కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్స్‌ను ఇవ్వడం వల్ల అప్పటికే మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయులు రెట్టింపు అవుతున్నాయి. మధుమేహం లేనివారిలోనూ చక్కెర స్థాయులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగని స్టెరాయిడ్స్‌ ఆపేయొద్దు. వైద్యులు నిర్దేశించిన విధంగా వాడాల్సిందే. తొలి దశతో పోల్చితే రెండో దశలో పిల్లల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయి. స్టెరాయిడ్స్‌ వాడడం వల్ల పిల్లల్లోనూ డయాబెటిస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. గర్భిణులకు వైరస్‌ సోకితే పిల్లలకూ మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగాయి. స్టెరాయిడ్స్‌ మొదలుపెట్టిన తొలిరోజు నుంచే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతున్నాయి. అప్పటివరకూ వారు ఎటువంటి మాత్రలు వేసుకుంటున్నా.. వాటిని ఆపేసి వెంటనే ఇన్సులిన్‌ చికిత్సకు మారాలి.  అప్పటివరకూ మధుమేహం లేకపోయినా.. స్టెరాయిడ్స్‌ వల్ల వస్తే రెండు మూడు రోజులు నియంత్రణకు ప్రయత్నించాలి. అప్పుడూ  ఇన్సులిన్‌ మొదలుపెట్టాల్సిందే. వీరిలో మూత్రసంబంధ ఇన్‌ఫెక్షన్లూ ఎక్కువగా రావచ్చు. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే ‘మ్యుకర్‌ మైకోసిస్‌’ వచ్చే అవకాశాలూ ఉన్నాయి.

నాడీ వ్యవస్థపైనా తీవ్ర దుష్ప్రభావం
-డాక్టర్‌ రంగనాథం, ప్రముఖ న్యూరో సర్జన్‌

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని అవయవాలపై పడుతున్నట్లే.. మెదడు, నాడీ వ్యవస్థపైనా పడుతోంది. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 30 శాతం మందిలో, ఐసీయూలో ఆక్సిజన్‌ సేవలు పొందినవారిలో 40 శాతం మందిలో, వెంటిలేటర్‌పై చికిత్స పొంది కోలుకున్నవారిలో 80 శాతం మందిలో నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతోంది. వైరస్‌ తీవ్రతను బట్టి ఆయా అవయవాల పనితీరు దెబ్బతింటోంది. ముఖ్యంగా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందినవారిలో సుమారు 5 శాతం మంది బాధితులు ఏదో ఒక న్యూరాలజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వైద్యనిపుణులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కొందరిపై మెదడువాపు (ఎన్‌సెఫలోపతి) వంటి ప్రమాదకరమైన జబ్బులు దాడి చేస్తున్నాయి. కొందరిలో మెదడు రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి పక్షవాతానికి గురవుతున్నారు. కొందరిలో కోలుకున్న తర్వాత కూడా చురుకుదనం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చుట్టాలను గుర్తుపట్టలేకపోవడం, వాళ్ల లోకంలో వారుండడం, కాలూ చేయీ సరిగా కదలకపోవడం.. వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికి చేరిన తర్వాతా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలను పొందాలి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని