టీకా.. ఇవ్వాలి చకచకా..!
close

ప్రధానాంశాలు

టీకా.. ఇవ్వాలి చకచకా..!

రాష్ట్రంలో ఇంకా వాక్సిన్‌ పొందాల్సినవారు 1.94 కోట్ల మంది

ప్రస్తుతం రోజుకు గరిష్ఠంగా 2 లక్షల డోసులే

ఇదే వేగంతో వెళ్తే తొలి డోసు ఇవ్వడానికే కనీసం 4 నెలలు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో టీకాల పంపిణీ ఆశించినంత వేగంగా జరగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో కలిసినా.. రోజుకు గరిష్ఠంగా 2 లక్షల డోసులు కూడా దాటడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,94,85,855 మంది అర్హులైన లబ్ధిదారులు టీకాలు పొందాల్సి ఉందని వైద్యఆరోగ్యశాఖే పేర్కొంది. ఇలా రోజుకు లక్షన్నర-రెండు లక్షల డోసుల చొప్పున టీకాలను పంపిణీ చేస్తూ వెళ్తే.. అర్హులైన వారందరికీ కనీసం తొలిడోసు వేయాలన్నా మరో 4 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయని వైద్యశాఖ అంచనా వేస్తోంది. అంటే ఈ ఏడాది అక్టోబరు నాటికిగానీ తొలిడోసు పూర్తి కాని పరిస్థితి. ఆ తర్వాత రెండో డోసుకు మరో 4 నుంచి 12 వారాల సమయం పడుతుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత.. తిరిగి యథావిధిగా జనజీవనం గాడిలో పడడం వంటి పరిణామల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను గనుక ఉల్లంఘిస్తే.. మరో దశ ఉద్ధృతి తప్పకపోవచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో టీకాల పంపిణీని ఎంత వేగంగా నిర్వహిస్తే.. అంత ఎక్కువమందిని ముప్పు నుంచి రక్షించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి టీకాల కేటాయింపులు పెద్దఎత్తున జరిగితే.. రోజుకు 10 లక్షల మందికైనా వేసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశామనీ, ప్రైవేటును కూడా కలుపుకొంటే వేగంగా వేయడం పెద్దకష్టమేమీ కాదని వైద్యవర్గాలు తెలిపాయి. సమస్యల్లా టీకాలు తగినన్ని అందుబాటులో లేకపోవడమేనని పేర్కొన్నాయి.

రెండు డోసులు పొందినవారు 14.38 లక్షల మందే

రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు డోసుల టీకాలను పొందిన వారు 14,38,460 మంది (28,76,920 డోసులు) మాత్రమే. తొలి డోసు మాత్రమే పొందినవారు 64,48,334 మంది ఉండగా.. మొత్తంగా రాష్ట్రంలో 93,25,254 డోసులను పంపిణీ చేసినట్లుగా వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కొవిషీల్డ్‌ టీకా 75,42,129 డోసులు కాగా.. కొవాగ్జిన్‌ 17,49,980 డోసులు, స్పుత్నిక్‌ వి టీకాను 33,145 డోసులు వేసినట్లుగా పేర్కొంటూ బుధవారం హైకోర్టుకు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక అందజేసింది.

నివేదికలో ముఖ్యాంశాలివీ..

* రాష్ట్రంలో ఇంకా టీకా పొందాల్సిన వారిలో 18-44 ఏళ్ల వయసున్న వారు 1,53,90,824 మంది, 45 ఏళ్లు పైబడినవారు 40,95,031 మంది ఉన్నారు.

* ప్రస్తుతం 3,29,770 కొవిషీల్డ్‌, 2,09,790 కొవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి.

* ఈ నెల 29 నాటికి మరో 10,76,370 డోసులు రాష్ట్రానికి రానున్నట్లు వైద్యశాఖ తెలిపింది.

* కొవిడ్‌ బాధితుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు ఆక్సిజన్‌ పడకలను పెంచామని, పిల్లల కోసం ప్రత్యేకంగా 6 వేల పడకలను సిద్ధంచేస్తున్నట్లు తెలిపింది.

పరిష్కరించింది 30 ఫిర్యాదులే

రాష్ట్రంలో 170 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులపై అధిక బిల్లుల విషయంలో కరోనా బాధితుల నుంచి ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్య శాఖకు 350 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేవలం 30 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. బాధితులకు రూ.72,20,277 ఇప్పించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని