రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ న్యాయ విచారణ!

ప్రధానాంశాలు

రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ న్యాయ విచారణ!

అవినీతి ఆరోపణలపై దృష్టి
ఫ్రెంచ్‌ మీడియాలో కథనం
మా వాదనే నిజమైంది: కాంగ్రెస్‌
ఆయుధ కంపెనీల చేతిలో పావుగా రాహుల్‌: భాజపా

దిల్లీ: భారత్‌కు రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాకు ఉద్దేశించిన రూ.59 వేల కోట్ల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ మొదలైంది. ఇందుకోసం ఒక న్యాయమూర్తి కూడా నియమితులైనట్లు పరిశోధనాత్మక కథనాలను వెలువరించే ఫ్రెంచ్‌ వార్తా వెబ్‌సైట్‌ ‘మీడియాపార్ట్‌’ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ‘‘రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై గత నెల 14న క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ లాంఛనంగా ప్రారంభమైంది. నేషనల్‌ ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆఫీస్‌ (పీఎన్‌ఎఫ్‌) ఈ విచారణకు ఆదేశించింది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఏప్రిల్‌లో మేం ఓ కథనాన్ని ప్రచురించాం. దీనికితోడు ఆర్థిక నేరాలపై దృష్టిసారించే ఫ్రాన్స్‌ స్వచ్ఛంద సంస్థ ‘షెర్పా’ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పీఎన్‌ఎఫ్‌ ఈ చర్యను చేపట్టింది. విచారణకు ఒక స్వతంత్ర న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్నారు. రఫేల్‌ ఒప్పందం కుదిరినప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాన్స్‌వో హోలన్‌, నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న నేటి అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌, నాడు రక్షణ మంత్రిగా ఉన్న నేటి విదేశాంగ మంత్రి లీ డ్రియాన్‌ల చర్యలపై ఉత్పన్నమైన సందేహాలను ఈ విచారణలో పరిశీలిస్తారు’’ అని మీడియాపార్ట్‌ వివరించింది. 2019లోనే ఈ అంశంపై ఫిర్యాదు దాఖలైనప్పటికీ నాటి పీఎన్‌ఎఫ్‌ అధిపతి దీన్ని మరుగుపరిచారని తెలిపింది. రఫేల్‌ తయారీ సంస్థ దసో ఏవియేషన్‌.. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10 లక్షల యూరోలను చెల్లించిందని ‘మీడియాపార్ట్‌’ ఏప్రిల్‌లోనే తెలిపింది. అనంతరం దసో ఈ ఆరోపణలను ఖండించింది.

36 రఫేల్‌ జెట్‌లను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబరు 23న మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో రఫేల్‌ యుద్ధవిమానం ధరను రూ.526 కోట్లుగా ఖరారు చేయగా.. మోదీ ప్రభుత్వం దాన్ని రూ.1670 కోట్లకు పెంచిందని దుయ్యబడుతోంది.  

ఏజెంటుగా రాహుల్‌: భాజపా

ప్రత్యర్థి ఆయుధ కంపెనీలకు ఏజెంట్‌లా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యవహరిస్తున్నారని భాజపా దుయ్యబట్టింది. రఫేల్‌ అంశంలో కొన్ని సంస్థలు ఆయనను పావుగా వాడుకున్నాయని ఆరోపించింది. భారత్‌ను బలహీనం చేయడానికే కాంగ్రెస్‌ పదేపదే ఈ వ్యవహారంపై అవినీతి ఆరోపణలు చేస్తోందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణకు ఆదేశించడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు ఫలితంగానే ఇది జరిగిందని చెప్పారు. దీన్ని బట్టి అవినీతి జరిగిందని భావించరాదన్నారు. ‘‘భారత్‌లో ఓ అధికారి ఏదైనా అంశం తన దృష్టికి వచ్చినప్పుడు సంబంధిత దస్త్రంపై ‘తగు విధంగా చర్యలు తీసుకోండి’ అని రాయడం లాంటిదే ఇది. దీనిపై కాంగ్రెస్‌ అసత్యాలు, అపోహలను వ్యాప్తి చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. రఫేల్‌ ఒప్పందంలో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు అందకపోవడం వల్లే ఆ పార్టీ ఈ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంలో ఎలాంటి తప్పులు జరగలేదని కాగ్‌, సుప్రీంకోర్టు తేల్చాయని చెప్పారు.


జేపీసీతోనే నిజాలు బయటకు: సూర్జేవాలా

ఫ్రాన్స్‌ ప్రభుత్వ తాజా చర్యతో రఫేల్‌ అంశంపై తమ నేత రాహుల్‌ గాంధీ చేసిన వాదన నిజమేనని రుజువైందని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘‘రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఇప్పుడు స్పష్టమైపోయింది. ఇప్పటికైనా ప్రధాని మోదీ ముందుకొచ్చి.. దీనిపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలి. వాస్తవాలు తెలుసుకోవడానికి ఇదే మార్గం’’ అని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోరుకు సంబంధించిన అంశం కాదని, దేశ భద్రత, దేశంలోని అతిపెద్ద ఆయుధ ఒప్పందంలో అవినీతికి సంబంధించిన అంశమని చెప్పారు. ప్రధాని సహా ఎవరినైనా పిలిచి విచారించే అధికారం జేపీసీకి ఉంటుందని, సుప్రీం కోర్టు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)కి అందుబాటులో ఉండని ప్రభుత్వ దస్త్రాలనూ ఈ కమిటీ పరిశీలించగలదని పేర్కొన్నారు. ఈ అంశం తమ పరిధి కాదని సుప్రీం కోర్టు ఇప్పటికే తేల్చినందువల్ల, దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోమని చెప్పారు. మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా రఫేల్‌ అంశంపై విమర్శలు చేశారు. ‘‘సూర్యుడు, చంద్రుడు, సత్యాన్ని ఎల్లకాలం దాచడం కుదరదు’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ రఫేల్‌ అంశాన్ని లేవనెత్తేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని