యడ్డీ వారసుడెవరు?

ప్రధానాంశాలు

యడ్డీ వారసుడెవరు?

ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా

కర్ణాటక కొత్త సీఎంపై ఉత్కంఠ

అధిష్ఠానం పరిశీలనలో దాదాపు 10 మంది పేర్లు

రేసులో ప్రహ్లాద్‌ జోషి, బి.ఎల్‌.సంతోష్‌, సి.టి.రవి

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠకు తెరలేచింది. రెండు నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా సీనియర్‌ నేతలు బి.ఎల్‌.సంతోష్‌, సి.టి.రవి సహా దాదాపు 10 మంది నేతల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, ముఖ్యమంత్రి యడియూరప్ప నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాజీనామా చేశారు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని, స్వచ్ఛందంగానే పదవీ త్యాగం చేస్తున్నానని ప్రకటించారు. సీఎంగా యడ్డీ నాలుగోసారి ప్రమాణం చేసి సోమవారం నాటికి సరిగ్గా రెండేళ్లు కావడం గమనార్హం. ఇకముందు కూడా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో తమ సర్కారు ఏర్పాటై రెండేళ్లు పూర్తవడంతో భాజపా బెంగళూరులో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.  అందులో ప్రసంగించిన యడియూరప్ప.. తన రాజీనామాపై ఊహాగానాలకు తెరదించారు. పదవి నుంచి తప్పుకొంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు రాజీనామా లేఖను సమర్పించగా ఆయన వెంటనే ఆమోదించారు. 2019 జులై 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తనకు.. ఈ రెండేళ్లు అగ్నిపరీక్షలా గడిచాయని యడియూరప్ప రాజ్‌భవన్‌ వద్ద చెప్పారు. భాజపాలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కిందని 78 ఏళ్ల యడియూరప్ప అన్నారు. 75 ఏళ్లు దాటినా సీఎంగా కొనసాగిన సంగతిని గుర్తుచేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నాకు మాటలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఇకపై కర్ణాటకలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని యడియూరప్ప తెలిపారు. గవర్నర్‌ పదవి వంటి అవకాశాలు వచ్చినా స్వీకరించబోనని స్పష్టం చేశారు.

ఆనాడే అంగీకారం

రాష్ట్రంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ సర్కారు పతనమయ్యాక 2019లో భాజపాప్రభుత్వం ఏర్పాటైంది. అధిష్ఠానంతో ఒప్పందంప్రకారం.. యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత రాజీనామా చేసేందుకు ఆనాడే అంగీకరించారు.

నేడే నిర్ణయం?

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం దిల్లీలో మంగళవారం జరగనుంది. ఈ సమావేశంలోనే కర్ణాటక నూతన సీఎం పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ మంగళవారం బెంగళూరుకు రానున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా రాష్ట్రానికి విచ్చేసి భాజపా శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని