ఆ జీవో ఏంటి? ఆ భాషేంటి?

ప్రధానాంశాలు

ఆ జీవో ఏంటి? ఆ భాషేంటి?

సీఎస్‌ కోర్టు ధిక్కరణ కేసులకు నిధుల ఉత్తర్వులపై హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కేసుల్లో పరిహారం చెల్లింపు నిమిత్తం రూ.58.95 కోట్లు మంజూరు చేశారంటున్న జీవోలో ఉపయోగించిన భాష ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ప్రశ్నించింది. ఈ జీవోను ఎలా రూపొందించారో ప్రభుత్వంలోని న్యాయశాఖ చూడాలంది. నిధుల మంజూరు ఉద్దేశమేమిటి.. జీవో పత్రం (డ్రాఫ్ట్‌)పై ఏమొచ్చిందని ప్రశ్నించింది. జీవోను రూపొందించిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల విచారణ నిమిత్తం ప్రభుత్వం రూ. 58.95 కోట్లు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు సీహెచ్‌.ప్రభాకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం చేశారు. దానిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం నిధులను విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌లో బుధవారం సాయంత్రమే హైకోర్టులో సీఎస్‌ కౌంటరు దాఖలు చేశారని.. ధర్మాసనం ముందు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ గురువారం ఉదయం ప్రస్తావించారు. పలువురు రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లలోని భూములకు పరిహారం చెల్లింపు నిమిత్తం ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జీవోలో పరిహారం కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొనలేదని చెప్పింది. ఏజీ సమాధానమిస్తూ జీవో జారీ ముందు ప్రస్తావన (రిఫరెన్స్‌)లో ఆ విషయాన్ని పేర్కొన్నారని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. శుక్రవారం సాధ్యం కాదని.. సోమవారం లేదా ఆ తరువాత విచారణ చేపడతామని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని