శ్రీవారి సర్వదర్శనం టికెట్ల పెంపు

ప్రధానాంశాలు

శ్రీవారి సర్వదర్శనం టికెట్ల పెంపు

తితిదే వెబ్‌సైట్‌లో టోకెన్ల లింకు

ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల?

తిరుమల, తిరుపతి - న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌లో సర్వదర్శన టోకెన్ల లింకును ఆదివారం ప్రవేశపెట్టారు. టికెట్లను మాత్రం విడుదల చేయలేదు. లింకును పరీక్షించేందుకే వెబ్‌సైట్‌లో పెట్టారు. బుధవారం నుంచి సర్వదర్శన టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశం ఉందని.. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ ప్రకటన చేస్తారని సమాచారం. ఇప్పటికే తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో రోజుకు రెండు వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. తమిళుల పురటాసి మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆదివారం 8 వేల టోకెన్లు జారీ చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే పరిమితమంటున్న సర్వదర్శనం టికెట్లను ఆధార్‌కార్డు ఆధారంగా అన్నిప్రాంతాల వారికి ప్రస్తుతం జారీ చేస్తున్నారు. వీటిపై తితిదే అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఆలయంలో ఆదివారం నుంచి శ్రీవారి ఏకాంతసేవను రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు తెలిపారు. గతేడాది మార్చి నుంచి రాత్రి 9 గంటలకే ఈ సేవను నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లను పెంచడంతో ఈ సేవ సమయాన్ని పాత విధానంలోకి తెచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని