పరిషత్తు ఏకపక్షమే

ప్రధానాంశాలు

పరిషత్తు ఏకపక్షమే

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస విజయం

తెదేపా ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం

ఈనాడు, అమరావతి: ఏపీలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైకాపా అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైకాపానే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున గెలిచింది. మొత్తం 515 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ 485 స్థానాల్ని కైవసం చేసుకుంది. 7,219 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. వైకాపా 5,965 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఎన్నికలను బహిష్కరించడం, గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థులు లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా విజయం నల్లేరుపై బండి నడకలా సాగింది. తెదేపా అభ్యర్థులు ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ, 809 ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించారు.  రెండు, మూడు మండలాల్లో వైకాపా కంటే తెదేపా ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్ని చేజిక్కించుకుంది. 164 ఎంపీటీసీ స్థానాలు గెలిచి జనసేన మూడో స్థానంలో నిలిచింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు రావడం మొదలైంది. రాత్రి 10 గంటల సమయానికి మెజార్టీ ఫలితాలు వెలువడ్డాయి. కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలన్న ఆదేశాలు చాలా లెక్కింపు కేంద్రాల్లో అమలు కాలేదు.

ఎన్నికలను బహిష్కరించిన తెదేపా

ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పరిషత్‌ ఎన్నికలకు రెండోసారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలకు నిరసనగా పరిషత్‌ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలు, ప్రస్తుత ఎస్‌ఈసీ వ్యవహరించిన తీరు చూశాక... పరిషత్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని, తెదేపా అభ్యర్థులు మెజార్టీ ఓట్లు సాధించినా గెలిచినట్టు ప్రకటిస్తారని, అక్రమ కేసులతో వేధించరనే నమ్మకం తమకు లేదని..  అందుకే ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్ని తెదేపా బహిష్కరించినప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ గత ఏడాది మార్చిలోనే పూర్తవడం, అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మళ్లీ కొనసాగించడంతో తెదేపా అభ్యర్థులు పోటీలో కొనసాగినట్టయింది. అయితే తెదేపా ఎన్నికల ప్రక్రియను పట్టించుకోకపోవడంతో, మండలం యూనిట్‌గా ఎన్నికలు జరిగే జడ్పీటీసీల్లో ఆ పార్టీకి స్వల్ప స్థానాలే దక్కాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో స్థానికంగా వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది కాబట్టి, తెదేపా తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు కొన్ని చోట్ల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫలితంగా ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా మెరుగైన స్థానాల్ని దక్కించుకోగలిగింది. మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాల్లో 10 శాతానికిపైగా తెదేపా గెలుచుకుంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే... కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో విపక్ష పార్టీల అభ్యర్థులు గెలిచినచోట, ఒకటికి రెండుసార్లు రీకౌంటింగ్‌ చేసి వైకాపా అభ్యర్థులు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించడం, అదే వైకాపా అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలిచినచోట్ల విపక్ష అభ్యర్థులు రీకౌంటింగ్‌కి పట్టుబట్టినా అధికారులు పట్టించుకోకపోవడం వివాదాస్పదమైంది.

జడ్పీటీసీల్లో ఫ్యాన్‌ గాలి

జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైకాపా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 11 చోట్ల, ఇతర కారణాలతో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెలువడేసరికి నర్సీపట్నం (విశాఖ జిల్లా), మోపిదేవి (కృష్ణా జిల్లా), గోపవరం (కడప), అగళి (అనంతపురం), వి.ఆర్‌.పురం (తూర్పుగోదావరి), ఆచంట (పశ్చిమగోదావరి) జడ్పీటీసీ స్థానాల్ని తెదేపా, అనంతగిరి (విశాఖ జిల్లా) జడ్పీటీసీని సీపీఎం, వీరవాసరం (పశ్చిమగోదావరి) స్థానాన్ని జనసేన గెలుచుకున్నాయి. అనంతపురం జిల్లా రోళ్లలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థి నెగ్గారు.

ఎంపీటీసీ ఎన్నికల్లో..

రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల, ఇతర కారణాల వల్ల 375 చోట్ల ఎన్నికలు జరగలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తెదేపా మెరుగైన ఫలితాలు సాధించింది. జిల్లాల వారీగా చూస్తే విశాఖ జిల్లాలో తెదేపాకు అత్యధిక స్థానాలు దక్కాయి. జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ గెలిచిన 164 ఎంపీటీసీ స్థానాల్లో 140 ఆ రెండు జిల్లాల్లోనే గెలవడం విశేషం.


25న జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక

జిల్లా పరిషత్‌ (జడ్పీ), ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 24న ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక, 25న జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నెల 20న ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి 25న ముగిస్తారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని