స్వరాజ్య సమరంలో పులి-మేక!

ప్రధానాంశాలు

స్వరాజ్య సమరంలో పులి-మేక!

చాయ్‌- ఈ మాట వినగానే మనలో చాలా మందికి ప్రాణం లేచి వస్తుంది! చాయ్‌ వాసన వస్తే చాలు నిద్రలోంచి మరీ లేచివస్తారు! అలాంటి చాయ్‌ స్వాతంత్య్రోద్యమ సమయంలోనూ మనవారిని ‘నిద్ర’ లేపటానికి తనవంతు పాత్ర పోషించింది!

జాతీయోద్యమమంటే బ్రిటిష్‌వారి మీద పోరు మాత్రమే కాదు. మన సమాజంలో పాతుకుపోయిన అవలక్షణాలపైనా యుద్ధం కొనసాగింది. అంటరానితనం, సామాజిక అసమానతల్లాంటి వాటిని తమకు అనుకూలంగా మలచుకొని, ప్రజల్లో అంతరాలు పెంచి తెల్లవారు పబ్బం గడుపుకొన్నారు. అందుకే మన అంతర్గత లోపాలను సరిదిద్దుకోవటంపైనా కొంతమంది ప్రయత్నాలు చేశారు. అందులో భాగమే పులి-మేక చాయ్‌!

గుజరాత్‌కు చెందిన నరన్‌దాస్‌దేశాయ్‌ 1892లో దక్షిణాఫ్రికాలో దాదాపు 500 ఎకరాల్లో తేయాకు తోటల వ్యాపారం చేసేవారు. బాగానే నడిచేది. కానీ అక్కడి బ్రిటిష్‌ ప్రభుత్వం స్థానికేతరుల పట్ల వివక్ష ప్రదర్శించేది. ఈ క్రమంలో ప్రభుత్వంతో సరిపడక వ్యాపారం వదిలేసుకొని కట్టుబట్టలతో 1915లో భారత్‌ వచ్చేశారు నరన్‌దాస్‌ దేశాయ్‌. ‘మంచి మనిషి. తేయాకు వ్యాపారంలో దిట్ట’ అంటూ అప్పట్లో దక్షిణాఫ్రికాలో భారతీయుల తరఫున పోరాడుతున్న గాంధీజీ ఇచ్చిన లేఖ ఒక్కటే ఆయనకున్న ఆస్తి ఆ క్షణాన! ఆ లేఖ బలంతో, గాంధీజీ స్ఫూర్తితో, స్వదేశీ ఊపుతో... గుజరాత్‌ టీ డిపోను ఆరంభించారు. డబ్బు సరిపోకుంటే స్థానిక ముస్లింలు కొంతమంది ఆర్థికంగా సాయం చేశారు. ఇందులో స్వదేశీ స్ఫూర్తితో పాటు సమానత్వ భావన కూడా కలిపారు నరన్‌దాస్‌! కులమత భేదాలు లేకుండా మనమంతా సమానమనే గాంధీజీ సందేశాన్ని అందరిలో నింపటానికి ప్రయత్నించారు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్‌ వారు భారతీయులను కులమత, ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ విభేదాలు, అంతరాలు తీసుకొచ్చి మనలో మనకు తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో భారతీయులంతా ఒకటే, ఎవరూ తక్కువకాదు, ఎవరూ ఎక్కువ కాదనే భావనను రగిలించటానికి వాఘ్‌-బక్రి (పులి-మేక) చాయ్‌ బ్రాండ్‌ను 1934లో ఆవిష్కరించారు. అంతరాలు, స్థాయి భేదాలు లేకుండా పులి, మేక ఒకే కప్పులో చాయ్‌ తాగుతున్న ఫొటోతో వచ్చిన ఆ బ్రాండ్‌ సంచలనం సృష్టించింది. గాంధీజీ కూడా దీన్ని మెచ్చుకునేవారు. ‘‘డబ్బుల్లేకుండా దక్షిణాఫ్రికా నుంచి వచ్చేశాక మా తాతగారు ఓ ఉన్నత ఉద్దేశంతో కంపెనీ ఆరంభించటానికి ముస్లిం శ్రేయోభిలాషులు అప్పు ఇచ్చారు. వారి సాయం లేకుంటే నేడు ఈ కంపెనీ ఉండేది కాదు. వారి రుణం ఎలా తీర్చుకోగలం?’’ అంటారు నరన్‌దాస్‌ మనవడు పియూష్‌ దేశాయ్‌. గాంధీజీ స్వదేశీ పిలుపునే కాకుండా... అందులోని అంతరార్థాన్ని కూడా గ్రహించి ఆరంభించిన ఈ పులి-మేక చాయ్‌ ఇప్పటికీ విజయవంతమైన బ్రాండ్‌గా సాగుతోంది. అమెరికా మార్కెటింగ్‌ గురు ఫిలిప్‌ కోట్లర్‌ ప్రపంచంలోని మార్కెటింగ్‌ బ్రాండ్లపై వేసిన పుస్తకంలో... ఈ వాఘ్‌-బక్రి గురించి కూడా ప్రస్తావించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని