రూ.3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి

ప్రధానాంశాలు

రూ.3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి

తాగునీటి పథకాలకు రూ. 1,200 కోట్లు

రెండేళ్లలో రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

నాలాలపై ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చట్టం తెస్తాం

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. హైదరాబాద్‌ మహానగరం పరిధిలో మురుగుజలాల శుద్ధికి రూ.3,866 కోట్లతో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.  వందశాతం శుద్ధి చేసే అరుదైన నగరాల్లో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంటుందన్నారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ వెలుపల, ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో తాగునీటి సరఫరాకు రూ.1,200 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రెండు జీవోలను మంత్రి విడుదల చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పురపాలకశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఏర్పాటు కానున్న 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు

‘‘జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజుకు 1,650 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీల)తో పాటు చుట్టుపక్కల వస్తున్న మరో 300 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో 31 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాం. నెలకొల్పిన తర్వాత 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్ట్‌ సంస్థలకే ఉంటుంది. శుద్ధి చేసిన మురుగునీటిని పూర్తిగా వినియోగించుకునేలా పరిశ్రమలశాఖ, పీసీబీ విధానాన్ని రూపొందిస్తాయి. తక్కువ నీటి వాడకం, మురుగునీటి శుద్ధి, శుద్ధి చేసిన మురుగునీటి వినియోగంపై దృష్టి సారించాం.

అదనంగా రెండు లక్షల కుటుంబాలకు నీరు

తాగునీటి పథకాలకు మంజూరైన నిధులతో 137 ఎంఎల్‌డీల సామర్థ్యంతో జలాశయాల నిర్మాణంతో పాటు కొత్తగా 1,200 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తాం. 2036వ సంవత్సరం వరకూ తాగునీటి అవసరాలను అంచనా వేసి మంజూరు చేసిన ప్రాజెక్టుతో అదనంగా రెండు లక్షల కుటుంబాలకు తాగునీరు అందుతుంది.

కంటోన్మెంట్‌ విలీనంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం

కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని పలువురు కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. కంటోన్మెంట్‌ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నాం. ఒక ఫ్లై ఓవర్‌ని కూడా నిర్మించలేకపోతున్నాం. టీఎస్‌బీపాస్‌, అన్నపూర్ణ క్యాంటీన్‌లు కూడా అమలు కావడం లేదు.

నాలాల విస్తరణపై ప్రత్యేక కార్యాచరణ

మొత్తం రూ.850 కోట్లతో నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వాటిపై ఇళ్లను నిర్మించుకున్నవారికి రెండు పడక గదుల ఇళ్లను కేటాయించి ఆక్రమణల తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే నగర ప్రజాప్రతినిధులతో సమావేశమై నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై చర్చిస్తాం. నాలాలపై ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టంలోని ప్రత్యేక నిబంధనలు ఉపయోగించుకుంటాం. అవసరమైతే చట్టం తెస్తాం’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని