కమలాపూర్‌ మండలంలో అత్యధిక దళితబంధు లబ్ధిదారులు

ప్రధానాంశాలు

కమలాపూర్‌ మండలంలో అత్యధిక దళితబంధు లబ్ధిదారులు

 హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికి 16,322 మందికి నిధులు

రూ.32.77 కోట్లతో రక్షణ నిధి 

ఈనాడు, హైదరాబాద్‌: దళితబంధు లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత రక్షణనిధి కార్డులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. హుజూరాబాద్‌ ప్రయోగాత్మక ప్రాజెక్టు పరిధిలో రూ.32.77 కోట్లతో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. లబ్ధిదారు స్వయం ఉపాధి యూనిట్‌ను ఎంచుకున్న తరువాత రక్షణనిధి కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగి దళిత కుటుంబాలు నష్టపోతే ఈ నిధి నుంచి ఆయా కుటుంబాలను ఆదుకుని తిరిగి ఉపాధి మార్గాల వైపు వెళ్లేలా ఎస్సీ సంక్షేమశాఖ నిబంధనలు రూపొందిస్తోంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో  చేపట్టిన గణనలో 24,500 ఎస్సీ కుటుంబాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఇక్కడ పథకం అమలుకు ప్రభుత్వం  రూ.2,200 కోట్లు మంజూరు చేసింది. ఆధార్‌, ఆహారభద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను రెండు, మూడు దశల్లో పరిశీలించి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు 16,322 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1622.41 కోట్లు జమ అయ్యాయి. నియోజకవర్గ పరిధిలో కమలాపూర్‌ మండల పరిధిలో అత్యధికంగా 3885 మంది ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమ చేశారు. తరువాత ఇల్లందకుంటలో 2068, హుజూరాబాద్‌ మండలంలో 2442, హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 1382, జమ్మికుంటలో 1894, జమ్మికుంట మున్సిపాలిటీలో 1820, వీణవంకలో 2831 మంది ఖాతాల్లోకి నిధులు వచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.10 వేలకు అదనంగా ప్రభుత్వం మరో రూ.10 వేలు వేసి ఇప్పటికే రూ.32.77 కోట్లు రక్షణ నిధి కింద సమకూర్చింది. వాసాలమర్రిలో 76 మందిలో ఇప్పటికే 66 మంది దరఖాస్తులను పరిశీలించి రూ.10 లక్షల చొప్పున జమ చేశారు.

నాలుగు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఒక్కో మండలం చొప్పున 4 మండలాల్లో దళితబంధు అమలు చేయాలని నిర్ణయించింది. చింతకాని (మధిర, ఖమ్మం), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌), నిజాంసాగర్‌ (జుక్కల్‌, కామారెడ్డి) మండలాల్లో అధికారులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. హుజూరాబాద్‌లో అమలవుతున్న కార్యక్రమాన్ని అధ్యయనం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. దళితబంధు కింద కల్పించే స్వయం ఉపాధి కార్యక్రమాలపై అవగాహన ముగిసిన తరువాత మండలాల పరిధిలో ఎస్సీ కుటుంబాల గణన చేపట్టనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని