సద్దుల బతుకమ్మా... వెళ్లి రావమ్మా...

ప్రధానాంశాలు

సద్దుల బతుకమ్మా... వెళ్లి రావమ్మా...


రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం వైభవంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది. పోయిరమ్మంటూ నిమజ్జనం చేస్తూనే ‘వచ్చే ఏడాది మళ్లీ రా బతుకమ్మా’ అంటూ వేడుకున్నారు. హనుమకొండ పద్మాక్షి మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండగ గురువారం రాత్రి ఘనంగా ముగిసింది. మొదటి రోజు మాదిరే చివరి రోజూ మహిళల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ‘‘పోయిరా బతుకమ్మ ఉయ్యాలో.. మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో’’ అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగాయి. చివరి రోజైన గురువారం రాష్ట్రంలో పలుచోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పెద్దఎత్తున జరిగాయి. తీరొక్క పూలతో మహిళలంతా వీధివీధినా బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. తొమ్మిదో రోజు పెరుగన్నం, చింతపండు పులిహోరా, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నంతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సిద్దిపేట కోమటిచెరువు వద్ద జరిగిన ఉత్సవాల్లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ జిల్లాల్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని