close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వసూళ్లపర్వంలో మరో ఇద్దరు మంత్రులు

  ఎన్‌ఐఏకు సచిన్‌ వాజే సంచలన లేఖ
  మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు

ముంబయి: ముకేశ్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసులో అరెస్టై ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే మరో బాంబు పేల్చాడు. ఇప్పటికే నెలకు రూ.100 కోట్లు వసూలు చేయమని పోలీసులను మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించారంటూ ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణతో అనిల్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాజే.. ఎన్‌ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్‌పై పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించాడు. ఇంకో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టాడు. 2004లో ఓ కేసుకు సంబంధించి వాజేను సస్పెండ్‌ చేశారు. 2020లో తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. తన నియామకం.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు ఇష్టం లేదని వాజే పేర్కొన్నారు. ‘‘నన్ను తీసుకోవద్దని పవార్‌ చెప్పారు. సస్పెండ్‌ చేయమన్నారు. ఆ సమయంలో హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. రూ.2 కోట్లిస్తే శరద్‌ పవార్‌ను ఒప్పిస్తానన్నారు. అంత మొత్తం చెల్లించలేనని చెప్పాను. తర్వాత  ఇవ్వమన్నారు. దక్షిణ ముంబయిలో ఓ అతిధి గృహంలో జరిగిన ఓ సమావేశంలో సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌పై విచారణ గురించి నాతో హోంమంత్రి మాట్లాడారు. రూ.50 కోట్లిస్తే విచారణ ముగిస్తామని చెప్పి.. ఆ ట్రస్టు నుంచి రూ.50 కోట్లు వసూలు చేయమన్నారు. ఆ ట్రస్టు సభ్యులెవరూ తెలియదని చెప్పాను. జనవరిలో మళ్లీ తన అధికారిక నివాసానికి పిలిపించుకుని, ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. ఒక్కో బార్‌ నుంచి 3 నుంచి 3.5 కోట్లు రాబట్టాలని అన్నారు. అది నా పరిధిలో లేదని చెప్పా. ఆ సమయంలోనే నన్ను ఉద్యోగంలో ఉంచినందుకు డిమాండ్‌ చేసిన రూ.2 కోట్లు గురించి దేశ్‌ముఖ్‌ ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరిలో (శివసేన)మంత్రి అనిల్‌ పరబ్‌ పిలిచి.. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌లో 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సన్నిహితుడనంటూ దర్శన్‌ అనే ఓ వ్యక్తి కూడా నవంబర్‌లో నన్ను కలిశారు. అక్రమ గుట్కా వ్యాపారస్థుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయనని చెప్పేసరికి, ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని దర్శన్‌ హెచ్చరించారు’’ అని లేఖలో వాజే పేర్కొన్నారు. మరోవైపు వాజే.. ఎన్‌ఐఏ కస్టడీని ఏప్రిల్‌ 9 వరకు పొడిగించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ.. వాజేను కూడా ప్రశ్నించనుంది. వాజే ఆరోపణలను మంత్రి అనిల్‌ పరబ్‌ ఖండించారు.
* సచిన్‌ వాజేపై ముంబయి పోలీసు విభాగం కూడా తన నివేదికను ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. అందులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌- వాజే సంబంధాలను ప్రస్తావించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు