Vaccine: జాన్సన్‌ టీకాతో అరుదైన సమస్య!

తాజా వార్తలు

Updated : 13/07/2021 17:15 IST

Vaccine: జాన్సన్‌ టీకాతో అరుదైన సమస్య!

వాషింగ్టన్‌: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోసు కరోనా టీకాకు మరోసారి చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్‌గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు అమెరికాలో 12.8 మిలియన్ల మందికి జాన్సన్‌ టీకా ఇవ్వగా.. 100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్‌డీఏ తెలిపింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. ఒకరు మరణించినట్లు వెల్లడించింది. టీకా తీసుకున్న 42 రోజుల్లోపు ఈ దుష్ప్రభావం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది.

సాధారణంగా ఏటా సీజనల్‌ ఫ్లూ, పుండ్లకు సంబంధించిన టీకాలు తీసుకున్న వారిలో 3000-6000 మందిలో గిలియన్-బారే సిండ్రోమ్‌ను గుర్తిస్తామని ఎఫ్‌డీఏ తెలిపింది. వీరిలో చాలా మంది కోలుకుంటారని పేర్కొంది. దీని వల్ల కండరాల్లో బలహీనతతో మొదలై పక్షవాతం వరకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది.

అయినప్పటికీ.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్ సహా ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మాత్రం మానొద్దని అమెరికా సీడీసీ స్పష్టం చేసింది. తాజాగా గుర్తించిన దుష్ప్రభావం చాలా అరుదని తెలిపింది. జాన్సన్‌ టీకా వల్ల తలెత్తే సమస్యలతో పోలిస్తే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని