close

తాజా వార్తలు

Updated : 16/01/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్..ఏడాదిలోపే అందుబాటులోకి టీకా..!

శాస్త్రవేత్తల కృషి ఫలితమన్న ప్రధాని

దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో వెలుగుచూసి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈలోపే దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఉపశమనం కలిగిస్తోంది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని దేశవ్యాప్త టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, మరే వ్యాధికి ఇంత తక్కువ సమయంలో టీకా అందుబాటులోకి రాలేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ తొలికేసు జనవరి 30, 2020న వెలుగుచూసింది. చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో చదువుకున్న కేరళకు చెందిన ఓ విద్యార్థి భారత్‌ తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ జనవరి 30వ తేదీన వెల్లడించింది. అదే సమయంలో దిల్లీ, ముంబయిల్లోనూ కొన్ని అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో తొలి కరోనా మరణం మాత్రం మార్చి 12న చోటుచేసుకుంది. కర్ణాటక కలబురగికి చెందిన ఓ 76ఏళ్ల వృద్ధుడు మరణించాడు. అయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న అనంతరం సొంత ఊరికి వెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రారంభమైన కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం అనతికాలంలోనే దేశమంతా వ్యాపించింది. ప్రస్తుతం దేశంలో కోటి మందిలో వైరస్‌ బయటపడగా, లక్షన్నర మందిని పొట్టనబెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ చర్యల వల్ల భారత్‌లో వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయగలిగినట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధిలోనూ దూకుడు..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అభివృద్ధిలోనూ భారత్‌ దూకుడుగానే వ్యవహరించింది. వైరస్‌కు సంబంధించిన జెనెటిక్‌ సమాచారం పొందిన వెంటనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమయ్యారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోన్న భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా వంటి సంస్థలతో పాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌, రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌-వీ టీకాల ప్రయోగాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వెనువెంటనే అనుమతులు ఇచ్చింది. ఇలా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆస్ట్రాజెనెకా, భారత్‌ బయోటెక్‌ మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. తొలి, రెండో దశల ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ సురక్షితం, సమర్థతపై సానుకూల ఫలితాల రావడంతో అత్యవసర వినియోగం కింద ప్రస్తుతం ఈ రెండు టీకాల వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

పెరిగిన ల్యాబ్‌లు..భారీ స్థాయిలో పరీక్షలు..
దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసిన నాటికి దేశంలో కేవలం ఒకేఒక్క వైరస్‌ నిర్ధారణ కేంద్రం ఉండేది. మార్చి 23వరకు ఆ సంఖ్య 160కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2333 ల్యాబ్‌ల ద్వారా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. వీటి ద్వారా నిత్యం దాదాపు పది లక్షల కొవిడ్‌ శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 18కోట్ల 57లక్షల కొవిడ్‌ టెస్టులను పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

ఇలా ఓవైపు భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తూ వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతూనే, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 16న ప్రారంభమైన ఈ టీకా పంపిణీ కార్యక్రమం ద్వారా మరికొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది. 

ఇవీ చదవండి..
భారత్‌..ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌
కొవిడ్‌ మూలాలు.. ఏడాదైనా మిస్టరీగానే..!Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని