కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌: ఆంక్షల దిశగా రాష్ట్రాలు!

తాజా వార్తలు

Published : 17/03/2021 16:24 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌: ఆంక్షల దిశగా రాష్ట్రాలు!

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ 

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశంలో కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ, గతకొన్ని వారాలుగా మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలల గడువు తర్వాత రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అప్రమత్తమవుతోన్న రాష్ట్రాలు వైరస్‌ కట్టడికి ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.

మహారాష్ట్రలో రెండో దఫా..

కొవిడ్‌-19 తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర, మరోసారి కరోనా విలయాన్ని చవిచూస్తోంది. గత కొన్నిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ రెండో దఫా విజృంభణ మొదలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం, అమరావతి, నాగ్‌పూర్‌ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇక పుణె, నాసిక్‌, ఔరంగాబాద్‌ నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ..

కొవిడ్‌ తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ కూడా అప్రమత్తమైంది. భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అంతేకాకుండా జబల్‌పూర్‌, గ్వాలియర్‌, ఉజ్జయిన్‌, ఛింద్వారా, బేతూల్‌తో పాటు మరికొన్ని పట్టణాల్లో మార్కెట్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంక్షల సమయంలో కేవలం అత్యవసర సేవలు, సరుకుల రవాణాకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.

గుజరాత్‌లోనూ ఆంక్షలు..

దేశంలో కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా ఐదు, ఆరు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న గుజరాత్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌ నగరాల్లో బుధవారం నుంచి మార్చి 31వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నేటినుంచి అహ్మదాబాద్ నగరం‌లో అన్ని గార్డెన్‌లు, పార్కులను సైతం మూసివేయాలని నిర్ణయించింది. ఈ మూడు రాష్ట్రాలే కాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉంది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కేరళలో ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు.

ఉద్ధృతికి కారణాలివే..?

దేశంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వైరస్‌ ముప్పు తొలగిపోలేదని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో వైరస్‌ తీవ్రత పెరగడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతోనే దేశంలో వైరస్‌ తీవ్రత ఎక్కువవుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ ఈమధ్యే‌ పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందనే ధైర్యంతో ఉన్న కొందరు, మాస్కులు, భౌతికదూరాన్ని పాటించకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో చాలా మంది ప్రజలు వైరస్‌కు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు (వైరస్‌ సోకడం ద్వారా, లేదా వ్యాక్సిన్‌ ద్వారా) లభించకపోవడం వల్ల ఈ వైరస్‌ ముప్పు ఇంకా పొంచివుందని పేర్కొన్నాయి. అయితే, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పూర్తిలాక్‌డౌన్‌ పరిష్కారం కాదని, స్థానికంగా జిల్లా స్థాయిల్లో ఆంక్షలతో దీన్ని కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అయ్యారు. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, అవలంభించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని