ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ చికిత్సాకేంద్రం మనవద్దే...

తాజా వార్తలు

Updated : 17/06/2020 12:08 IST

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ చికిత్సాకేంద్రం మనవద్దే...

22 ఫుట్‌బాల్‌ మైదానాల విస్తీర్ణం..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికి పెరుగుతోంది. ప్రస్తుతం 45 వేలకు చేరువలో ఉన్న ఇక్కడి కొవిడ్‌-19 కేసుల సంఖ్య... జులై ఆఖరుకల్లా ఐదు లక్షల మార్కును దాటొచ్చని దిల్లీ యంత్రాంగం భావిస్తోంది. ఆ పరిస్థితిలో కొవిడ్‌ బాధితుల కోసం ఆస్పత్రుల్లో కనీసం లక్ష పడకలు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడి రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తాత్కాలిక కరోనా వైరస్‌ చికిత్సా కేంద్రంగా మార్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్‌ చికిత్సా కేంద్రమని అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రత్యేకతలను వారు వివరించారు.

దక్షణ దిల్లీలోని ఛతార్‌పూర్‌ ప్రాంతంలో 12,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రం విస్తరించి ఉంది. ఇది దాదాపు 22 ఫుట్‌బాల్‌ మైదానాల మొత్తం విస్తీర్ణంతో సమానం.

* వీటిలో శానిటైజేషన్‌ చేయనవసరం లేని కార్డ్‌బోర్డ్‌ పడకలను ఏర్పాటు చేస్తున్నారు. లోహం, ప్లాస్టిక్‌, కలప తదితర ఉపరితలాలపై  ఐదురోజుల వరకు ఉండగల కరోనా వైరస్‌...  కార్డ్‌బోర్డ్‌పై 24 గంటల కన్నా ఎక్కువసేపు జీవించి ఉండలేదు. కార్డ్‌బోర్డ్‌తో తయారయ్యే ఈ పడకలను తిరిగి వినియోగించవచ్చు. అతి తేలికగా ఉండే వీటిని జోడించటం, విడదీయటం కూడా సులభమే.

ఈ కేంద్రాన్ని 500 పడకలున్న 20 మినీ ఆస్పత్రులుగా విభజించారు. వీటిలో ఇప్పటికే ఫ్యాన్లు, సీసీటీవీ కెమేరాలు తదితర ఏర్పాట్లున్నాయి.

400 మందికి పైగా వైద్యులు, 800 పైగా పారామెడికల్‌ సిబ్బంది రెండు షిఫ్టుల్లో నిరంతరం విధినిర్వహణలో ఉంటారు.

ఇక్కడ పది శాతం పడకలు ఆక్సిజన్‌ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. అయితే వెంటిలేటర్‌ సదుపాయం లేనందున క్లిష్ట పరిస్థితిలో బాధితులను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు.

ఈ కొవిడ్‌ చికిత్సా కేంద్రంలో సమర్ధవంతమైన పర్యవేక్షణ కోసం ఈ-మేనేజిమెంట్‌ వ్యవస్థను వాడనున్నారు.

ఇక్కడ విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది కోసం సైన్యం, పారామిలటరీ, వాలంటీర్లను ఉపయోగించుకోనున్నారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్న ఈ కేంద్రం జూన్‌ 30 కల్లా సిద్ధమౌతుందని భావిస్తున్నారు.

మూడు లక్షల మంది ఒకేసారి ప్రార్థనలు నిర్వహించగల విశాలమైన రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రం తాత్కాలిక కొవిడ్‌ కేంద్రంగా అత్యుత్తమమని ఈ కేంద్రానికి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌ బీఎం మిశ్రా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలను పూర్తిగా పాటిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని