కరోనా పరీక్షల ధరల్లో ఎందుకీ వ్యత్యాసం..!

తాజా వార్తలు

Published : 19/06/2020 15:45 IST

కరోనా పరీక్షల ధరల్లో ఎందుకీ వ్యత్యాసం..!

దిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరల్లో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని కచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. అలానే ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కరోనా పరీక్షల ధరలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉందని, దేశమంతా ఒకే ధర అమలయ్యేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.కె. కౌల్‌, జస్టిస్‌ ఎమ్‌ ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం పరిధిలోని వ్యవహారాలపై కోర్టు జోక్యం చేసుకోదని, ఎంత ధరను వసూలు చేయాలనేది కోర్టు నిర్ణయించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అలాగే రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

గత నెలలో భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) కరోనా పరీక్షల కిట్ల ధరలు దిగిరావడంతో గతంలో నిర్ణయించిన రూ.4,500 ధరపై పరిమితులను ఎత్తివేసింది. అలానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రైవేటు లేబొరేటరీల్లో నమూనాలను పరీక్షించేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలను వసూలు చేయాలని సూచించింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, దిల్లీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.  తాజాగా దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్లీలో కరోనా పరీక్షల ధరను రూ.4,500 నుంచి రూ.2,400లకు తగ్గిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలానే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉండే ఇంటెన్సివ్‌ కేర్‌, ఐసోలేషన్ బెడ్లు, చికిత్స ధరలను కూడా తగ్గించింది.  ఇక మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా కరోనా పరీక్షల ధర రూ. 2,200గా నిర్ణయించినట్లు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు ప్రకటించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని