ధూళిలో నెల వరకూ కరోనా మనుగడ! 

తాజా వార్తలు

Updated : 16/04/2021 10:08 IST

ధూళిలో నెల వరకూ కరోనా మనుగడ! 

వాషింగ్టన్‌: ధూళిలో కరోనా వైరస్‌ ఏకంగా ఒక నెల వరకూ మనుగడ సాగించగలదని తాజా అధ్యయనం పేర్కొంది. ఆసుపత్రులు, పాఠశాలల్లో మహమ్మారి విస్తృతిని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్థానికంగా కరోనా ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని వ్యర్థజలాలు, మురుగు నీటిపై అనేక దేశాలు.. పరిశీలనలు చేపట్టాయి. అక్కడి ప్రజల్లో వ్యాధి లక్షణాలేమీ లేనప్పటికీ కొవిడ్‌ తీవ్రతపై ఒక అంచనాకు రావడానికి ఆ వివరాలు ఉపయోగపడ్డాయి. ఇదే విధంగా ధూళిపైనా పరిశోధనలు చేయడం ద్వారా ఆసుపత్రులు, పాఠశాలల్లో కరోనా ఉద్ధృతిని అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరు కొవిడ్‌ బాధితులను ఉంచిన గదులపై పరిశీలనలు చేపట్టారు. అలాగే పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ఇళ్లల్లో నుంచి కూడా నమూనాలను సేకరించారు. అక్కడ వాక్యూమ్‌ బ్యాగ్‌ల నుంచి సేకరించిన ధూళిని పరిశీలించారు. గదుల ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొని విశ్లేషించారు. ధూళి నమూనాల్లో 97 శాతం మేర, ఉపరితల నమూనాల్లో 55 శాతం మేర కరోనా జన్యుపదార్థమైన ఆర్‌ఎన్‌ఏ మనుగడ సాగించగలుగుతోందని తేల్చారు. మానవులకు వైరస్‌ను వ్యాప్తి చేసే సామర్థ్యం ఈ ధూళికి ఉందా అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశీలన సాగించలేదు. ధూళిలో ఉన్నప్పుడు కొంతకాలానికి.. కరోనా వైరస్‌లో కొమ్ముల్లాంటి ఆకృతులతో కూడిన వెలుపలి పొర విచ్ఛిన్నమవుతుందని పరిశోధకులు తెలిపారు. మానవుల్లోకి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ఈ పొరదే కీలక పాత్ర.  

వ్యాక్సిన్లతో పోల్చితే... కొవిడ్‌తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం

దిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకున్నవారితో పోల్చితే, కొవిడ్‌-19 బాధితుల్లోనే రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు... పలువురు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నవారిని, కరోనా బాధితులను రెండు వారాలపాటు పరీక్షిస్తూ వచ్చారు. వీరిలో ఎంతమంది ‘మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టడం (సీవీటీ)’తో బాధపడుతున్నారన్నది తులనాత్మకంగా విశ్లేషించారు. చాలామంది కొవిడ్‌ బాధితుల్లో సీవీటీ సాధారణంగానే తలెత్తుతోందని, ఇలాంటి వారిలో 30% మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారని పరిశోధకులు తేల్చారు. టీకా తీసుకున్న తర్వాత పరిస్థితితో పోల్చితే... కొవిడ్‌ కారణంగానే 8-10 రెట్లు అధికంగా సీవీటీ ముప్పు పొంచి ఉందని వారు కనుగొన్నారు. ‘‘కొన్ని కొవిడ్‌ వ్యాక్సిన్ల కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టే ముప్పు ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు వాటి వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల కంటే కొవిడ్‌ కారణంగానే సీవీటీ ముప్పు తీవ్రంగా ఉంటోంది. టీకా వల్ల లాభనష్టాలను అంచనా వేసుకునేటప్పుడు దీన్ని గమనంలోకి తీసుకోవాలి. రక్తం గడ్డకట్టడానికి ఇన్‌ఫెక్షన్, వ్యాక్సిన్లు ఒకే తీరులో కారణమవుతున్నాయా? అన్న విషయమై లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది’’ అని పరిశోధనకర్త పాల్‌ హారిసన్‌ పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని