Vaccine: 2 డోసులుగా వేర్వేరు వ్యాక్సిన్లు

తాజా వార్తలు

Updated : 01/06/2021 11:50 IST

Vaccine: 2 డోసులుగా వేర్వేరు వ్యాక్సిన్లు

 త్వరలోనే పరిశోధన చేపట్టనున్న కేంద్రం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌పై పోరాటంలో భాగంగా ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం... తొలి డోసు ఏ టీకా వేయించుకుంటే, రెండో డోసూ అదే టీకా తీసుకోవాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా చాలామంది కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. వీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జాప్యమవుతోంది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది? అలా చేయడం వల్ల ప్రయోజనాలేంటి? ప్రమాదాలేంటి? - అన్న అంశాలపై పరిశోధన సాగించాలని తలపోసింది. నెల రోజుల్లోనే ఈ క్రతువు ప్రారంభం కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా... 

ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో 20 మందికి మొదటి, రెండో డోసులుగా వేర్వేరు సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు వేశారు. తొలిడోసుగా ఆస్ట్రాజెనికా రూపొందించిన కొవిషీల్డ్‌ను గత ఏప్రిల్‌లో; రెండో డోసుగా దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ను మే నెలలో వారికి అందించారు. తర్వాత వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అసలు దుష్ప్రభావాలేవీ కనిపించలేదని అధికారులు చెప్పారు.
స్పెయిన్‌కు చెందిన కార్లోస్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇలాంటి పరిశోధనే సాగించింది. మొదటి డోసుగా ఆస్ట్రాజెనికా, రెండో డోసుగా ఫైజర్‌ వ్యాక్సిన్లు తీసుకున్నవారు భద్రంగా ఉన్నారని, ఆ టీకాలు వారిలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించారు.

సింగిల్‌ డోసుపైనా అధ్యయనం...

మరోవైపు- కొవిషీల్డ్‌ టీకా సింగిల్‌ డోసు ప్రభావంపైనా శాస్త్రీయ అధ్యయనం సాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘‘వ్యాక్సిన్‌ డేటాను సమీక్షించేందుకు ప్రభుత్వం ఒక యాప్‌ తీసుకొస్తోంది. వ్యాక్సినేషన్‌ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదురైతే వాటిని ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా వెంటనే వైద్య సహాయం అందించే వీలుంటుంది. భవిష్యత్తులో ఈ అప్లికేషన్‌ను కొవిన్‌ పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు’’ అని సదరు అధికారి తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని