Ramdev: మీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం

తాజా వార్తలు

Updated : 24/05/2021 06:44 IST

Ramdev: మీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం

రాందేవ్‌ బాబాకు హర్షవర్ధన్‌ ఘాటు లేఖ
వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న యోగా గురు

దిల్లీ: ‘అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ యోగా గురు రాందేవ్‌బాబాకు ఆదివారం ఘాటుగా లేఖ రాశారు. వివాదాస్పద మాటలతో దేశ ప్రజల మనోభావాలు కూడా దెబ్బ తీశారంటూ ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని, ఈ పోరాటాన్ని నీరుగార్చవద్దని కోరారు. ‘అల్లోపతి పనికిమాలిన వైద్యం’ అంటూ రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై శనివారం భారత వైద్యమండలి (ఐఎంఏ) తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వైద్యుల నిరసన చూశాక.. ఆ వ్యాఖ్యలు రాందేవ్‌బాబా చేసినవి కాదంటూ హరిద్వార్‌ పతంజలి యోగపీఠం ట్రస్టు ఖండించింది. ‘అల్లోపతి వైద్యం ఓ నాటకం.. దివాలా తీయిస్తుందంటూ మీరు చెప్పడం దురదృష్టకరం. కరోనాపై మనం చేస్తున్న పోరాటంలో ఇప్పటికే ఎంతోమంది ఆరోగ్య కార్యకర్తలు సమిధలయ్యారు’ అని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. వ్యాఖ్యల ఉపసంహరణ కోరుతూ రాందేవ్‌బాబాకు తాము నోటీసు ఇచ్చినట్టు ఐఎంఏ తెలిపింది.

వెనక్కుతగ్గిన రాందేవ్‌బాబా
వైద్యుల ఒత్తిడి, కేంద్ర మంత్రి లేఖ ఫలించి యోగా గురు మెట్టు దిగారు. ‘అల్లోపతి వైద్యంపై నేను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నా. అన్నిరకాల వైద్యాలను నేను గౌరవిస్తాను. ముఖ్యంగా అల్లోపతి ఎంతోమంది జీవితాలను కాపాడుతోంది. ఈ విషయం ఇంతటితో ముగించాలని అనుకొంటున్నా’ అంటూ యోగా గురు రాందేవ్‌బాబా ఆదివారం కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ లేఖకు బదులిస్తూ ట్వీట్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని