Young Indian Diplomats: ఈ యువ దౌత్యవేత్తలు పాక్‌ను ఉతికి ఆరేశారు..!

తాజా వార్తలు

Updated : 27/09/2021 14:13 IST

Young Indian Diplomats: ఈ యువ దౌత్యవేత్తలు పాక్‌ను ఉతికి ఆరేశారు..!

ఐరాసలో భారత యువ దౌత్యవేత్తల దూకుడుకు పాక్‌ కుదేలు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచంలోనే అతిపెద్ద భౌగోళిక రాజకీయ వేదిక ఐరాస. ఇక్కడ కాకలు తీరిన దౌత్యవేత్తలు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రత్యర్థులపై ఆరోపణలు చేయాలన్నా.. వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టాలన్నా ఎవరిక వారే సాటి అన్నట్లు ఉంటారు. గత కొన్నేళ్లుగా ఐరాసలో భారత్‌ దౌత్యవేత్తలు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2016లో ఐరాసలో భారత రాయబారిగా సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఉన్నప్పటి నుంచి కొత్త ట్రెండ్‌ మొదలైంది. పాక్‌ సీనియర్‌ దౌత్యవేత్తలు చేసే ఆరోపణలకు భారత యువ దౌత్యవేత్తలు ముఖం పగిలేలా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి పాక్‌ పరువు పోగొట్టుకునేట్లు చేశారు. పరువు పోగొట్టుకున్న బాధితుల్లో సగం మంది పాక్‌ ప్రధానులే ఉన్నారు. మన యువ దౌత్యవేత్తల్లో ఒక్క మిజిటో వినిటో తప్ప మిగిలిన వారంతా యువతులే కావడం విశేషం..!

ఎనామ్‌ గంభీర్‌తో మొదలు..!

ఐరాసలో 2016 సెప్టెంబర్‌లో పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌పై ఆరోపణలు చేశారు. దీనికి నాటి ఐరాసలోని భారత ఫస్ట్‌ సెక్రటరీ ఎనామ్‌ గంభీర్‌ రైట్‌ టూ రిప్లైను వినియోగించుకొన్నారు. ‘‘ ప్రపంచం ఇప్పటికీ మరిచిపోలేదు. అమెరికాలోని జంట భవనాలపై దాడి దర్యాప్తు పాకిస్థాన్‌లోని అబౌటాబాద్‌కు దారితీసిన విషయం తెలిసిందే. పూర్వకాలంలో తక్షశిల ప్రముఖ విద్యాకేంద్రంగా విలసిల్లింది. ఇప్పుడది ఉగ్రవాదులకు కేంద్రంగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంలో అడుగుపెట్టిన వారిని ఆకర్షిస్తోంది. ఆ విష ప్రభావం ఇప్పుడు ప్రపంచంపై పడుతోంది’’ అని పేర్కొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరోసారి పాక్‌ దౌత్యవేత్త మలెహా లోధీ ఆరోపణలకు గట్టి జవాబు ఇచ్చారు. 

పాక్‌ అబద్దాలను బయటపెట్టిన పౌలమీ..!

2017 పాక్‌ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం పిల్లెట్‌ గన్స్‌ వాడుతూ హింస సృష్టిస్తోందని ఓ ఆడపిల్ల ఫొటోను పాక్‌ దౌత్యవేత్త మలెహా లోధీ షేర్‌ చేశారు. పాక్‌ ఆరోపణలు శుద్ధ అబద్ధం. దీంతో భారత ఫస్ట్‌ సెక్రటరీ పౌలమీ త్రిపాఠీ జవాబు చెప్పే బాధ్యతను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ‘పాక్‌ ప్రతినిధి ఐరాసను తప్పుదోవ పట్టించారు. ఆమె చూపిన ఫొటో 22 జులై 2014వ తేదీ అమెరికా ఫొటోగ్రాఫర్‌ హెయిడ్‌ లెవినె తీశారు. ఆ ఫొటోలోని పాలస్తీనా బాలిక పేరు ‘రావ్య అబు జోమా’. ఆ ఫొటో న్యూయార్క్‌ టైమ్స్‌ మార్చి 2015న పబ్లిష్‌ కూడా అయింది. దానికి ‘కాన్ఫిలిక్ట్‌, కరేజ్‌ అండ్‌ హీలింగ్‌ ఇన్‌ గాజా’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు పాక్‌ ప్రేరిత ఉగ్రవాదుల చేతిలో మరణించి భారత లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ ఫొటోను ఆమె ఐరాసకు చూపించారు. అతడిని ఉగ్రవాదులు క్రూరంగా హింసించి హత్యచేసిన విషయాన్ని వెల్లడించారు. దీంతో కశ్మీర్‌లో పాక్‌ చేస్తున్న హింస ప్రపంచానికి కళ్లకు కట్టినట్లైంది. 

ఇమ్రాన్‌ నోరుమూయించిన విదిషా..

2019 ఐరాస జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దాదాపు 50 నిమిషాలు ప్రసంగించారు. ఇంత సేపు ప్రసంగించడం ఐరాసలో చాలా అరుదు. తన ప్రసంగంలో సగం సమయం భారత్‌పై విమర్శలు చేయడానికే వెచ్చించారు. ఈ సందర్భంగా భారత ఫస్ట్‌ సెక్రటరీ విదిషా మిత్ర రైట్‌ టూ రిప్లై హక్కును వినియోగించుకొని ప్రసంగిస్తూ.. ‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బెదిరింపులు  ప్రమాదకరమైన బూచిని చూపి లబ్ధి పొందాలనుకొనే వైఖరిని ప్రతిబింబిస్తోందే కానీ, ఓ రాజకీయ వేత్తను కాదు’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘పాక్‌లో ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులు, 25 ఉగ్రసంస్థలు ఉన్నాయని ప్రధాని ధ్రువీకరిస్తారా..? ప్రపంచంలో ఐరాస గుర్తించిన ఐసిస్‌, అల్‌ఖైదా ఉగ్రవాదులకు పింఛన్లు అందజేసే ఏకైక దేశం పాకిస్థానే అని అంగీకరిస్తారా..?ఎఫ్‌ఏటీఎఫ్‌ అమలు చేయాలని సూచించిన 27 నిబంధనల్లో 20 ఉల్లంఘించలేదని చెప్పగలరా..?ఒసామా బిన్‌ లాడెన్‌ను సమర్థించలేదని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పగలరా..?’’ అని నిలదీశారు. ఒక దశలో ఇమ్రాన్‌ ఖాన్‌ నియాజీ అని సంబోధించారు. బంగ్లా యుద్ధంలో భారత్‌కు లొంగిపోయిన ఏఏకే నియాజీ పేరును పరోక్షంగా పాక్‌కు గుర్తు చేశారు. 

పాక్‌లో మైనార్టీల బాధలను వెల్లడించిన మిజితో వినిటో..!

గతేడాది ఐరాసలో  మిజిటో వినిటో భారత్‌ గొంతుక అయ్యారు. నాగాలాండ్‌లో పుట్టిన అతను దక్షిణ కొరియాలో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. 2020లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగానికి సమాధానం ఇచ్చారు. ‘‘గత 70ఏళ్లుగా ఉగ్రవాదం, మైనార్టీల హత్యలు, మెజార్టీల నియంతృత్వం, రహస్య అణువ్యాపారంలో పాకిస్థాన్‌ విశ్వకీర్తిని సంపాదించుకొంది’’ అంటూ బదులిచ్చారు.

ఇమ్రాన్‌కు స్నేహా దీటైన సమాధానం..!

కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ  పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ చేసిన ప్రసంగంపై భారత ఫస్ట్‌ సెక్రటరీ స్నేహా దూబే స్పందించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఎదురుదాడి చేశారు. ‘‘ఐరాస భద్రత మండలి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇచ్చింది. పెరటిలోనే ఉగ్రవాదులను పెంచే ఆ దేశ చర్యలతో ప్రపంచం మొత్తం నష్టపోయింది. ఈ విషయం సభ్య దేశాలకు తెలుసు. ఇతరుల అంతర్గత విషయాలపై మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాకిస్థాన్‌.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోంది. ఇంటికి నిప్పు పెట్టి ఆ మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది. ’ అని తిప్పికొట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని