మరో 2 జిల్లాల్లో లాక్‌డౌన్: పుణెలో నైట్‌ కర్ఫ్యూ‌! 

తాజా వార్తలు

Published : 12/03/2021 16:06 IST

మరో 2 జిల్లాల్లో లాక్‌డౌన్: పుణెలో నైట్‌ కర్ఫ్యూ‌! 

మహారాష్ట్రను మరోసారి వణికిస్తున్న కరోనా

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. తగ్గినట్టే కనబడిన ఈ వైరస్‌ వ్యాప్తి కోరలు చాస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల అధికార యంత్రాంగ్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అకోలా, పర్భణి జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. పుణెలో మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. పుణె జిల్లాలో నిన్న ఒక్కరోజే 2840 కొత్త కేసులు రావడంతో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్‌పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 31వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నట్టు వెల్లడించారు. బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు.

ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో నడపాలని, రాత్రి 10గంటల తర్వాత మూసివేయాలని ఆదేశించారు. పుణెలో షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు, సినిమా థియేటర్లకు రాత్రి 10గంటల తర్వాత అనుమతి ఉండదన్నారు. వివాహాలు, అంత్యక్రియలు, తదితర కార్యక్రమాలకు 50మంది మించి హాజరుకారాదని నిబంధన విధించారు. ఈ నిబంధనలు ఈ రోజు రాత్రి నుంచే అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టంచేశారు.

మరోవైపు, అకోలాలో లాక్‌డౌన్‌ విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు ఈ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని జిల్లా అధికారులు వెల్లడించారు. అలాగే, పర్భణి జిల్లాలోనూ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాత్రి 12 నుంచి ఈ నెల 15న ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు.

గత నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు నిన్న సాయంత్రం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే కొత్తకేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.  గురువారం ఒక్క రోజే 14వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దేశంలో యాక్టివ్‌ కేసులు అత్యధికంగా ఉన్న టాప్‌ 10 జిల్లాలో మహారాష్ట్రలోనే ఎనిమిది జిల్లాలు ఉండటం ఆందోళనకరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని