మూడోరోజు.. నడవని పార్లమెంట్‌
close

తాజా వార్తలు

Published : 10/03/2021 16:57 IST

మూడోరోజు.. నడవని పార్లమెంట్‌

సాగుచట్టాలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

దిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడ్డాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాల గంటను చేపట్టారు.  అయితే ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో స్వల్ప విరామాలతో సభను రెండుసార్లు వాయదా వేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ తిరిగి ప్రారంభమవగా.. విపక్ష సభ్యులు మళ్లీ నిరసనకు దిగారు. దీంతో లోక్‌సభను మార్చి 15 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖీ ప్రకటించారు. 

అటు పెద్దలసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలపై చర్చ కోసం విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే నోటీసు ఇచ్చారు. అయితే ఇందుకు ఛైర్మన్ అంగీకరించలేదు. బడ్జెట్‌ సమావేశాలు అయినందున దానిపై చర్చ జరగాలని సూచించారు. దీంతో విపక్ష ఎంపీలు లేచి నిరసన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు వాయిదా పడ్డ సభ చివరకు ఎలాంటి చర్చ లేకుండానే సోమవారానికి వాయిదా పడింది. చమురు ధరలపై విపక్షాల నిరసనలతో గత రెండు రోజులు కూడా పార్లమెంట్‌ సజావుగా సాగని విషయం తెలిసిందే. 

మహా శివరాత్రి సందర్భంగా గురువారం పార్లమెంట్‌కు సెలవు. నిబంధనల ప్రకారం.. గురువారం ఏదైనా సెలవు వస్తే ఆ మరుసటిరోజైన శుక్రవారాన్ని కూడా సెలవుదినంగానే ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉభయ సభలు మార్చి 15కు వాయిదా పడ్డాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని