తిరిగొచ్చేసరికి 9 మంది చనిపోయారు..
close

తాజా వార్తలు

Published : 10/06/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరిగొచ్చేసరికి 9 మంది చనిపోయారు..

ముంబయి భవనం కూలిన ఘటనలో హృదయవిదారక దృశ్యం

ముంబయి: రాత్రి 11 గంటలు.. ఇంట్లో పాలు నిండుకున్నాయి. తెల్లారగానే ఛాయ్‌ తాగనిదే రోజు మొదలవదు. ఇదిగో నేను పాలు తీసుకుని వస్తా అంటూ బయల్దేరాడు ఆ ఇంటిపెద్ద. దగ్గరలోకి దుకాణంలో పాలు తీసుకుని తిరిగొచ్చేసరికి ఊహించని దృశ్యం కళ్లముందు కన్పించింది. అప్పటిదాకా తాను నివసిస్తున్న భవనం  కుప్పకూలి తనవారినంతా బలితీసుకుంది. ఆ ప్రమాదం నుంచి క్షణకాలంలో బయటపడిన తన అదృష్టానికి ఆనందపడేలోపే.. 9 మంది కుటుంబసభ్యులను మింగేసి దురదృష్టం వెక్కిరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన ఘోర ప్రమాదంలో భార్యా, పిల్లలను కోల్పోయిన రఫీఖ్‌ షేక్‌ వేదన వర్ణనాతీతం. 

ముంబయిలోని మల్వానీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ రెండంతస్తుల భవనం కూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. ఈ భవనంలోనే రఫీఖ్‌ కుటుంబం కొన్నేళ్లుగా అద్దెకుంటోంది. రఫీఖ్‌ కుటుంబంతో పాటు ఆయన సోదరుడి కుటుంబం కూడా ఇక్కడే కలిసుంటోంది.  

బుధవారం రాత్రి రఫీఖ్‌ పాలు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్ది క్షణాల తర్వాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆయన తిరిగొచ్చేసరికి స్థానికులంతా గుమిగూడి శిథిలాలు తొలగిస్తూ కన్పించారు. ఆ తర్వాత సహాయక సిబ్బంది వచ్చి భవన శిథిలాలను తొలగించారు. ఈ ఘటనలో రఫీఖ్‌ భార్య, సోదరుడు, మరదలు, ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రఫీఖ్ మరో కుమారుడు ఆ సమయంలో మందులు తీసుకొచ్చేందుకు మెడికల్‌ షాపుకు వెళ్లడంతో అతడు కూడా ప్రాణాలతో బయటపడగలిగాడు. ‘‘భవనం శిథిలావస్థకు చేరుకుందని ఏ రోజూ అన్పించలేదు. మా వాళ్లు బయటకు పారిపోయే అవకాశం కూడా లేకుండా ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల తుపాను కారణంగా పడిన వర్షాలు, బుధవారం నాటి భారీ వర్షంతో భవనం పూర్తిగా తడిసిపోయి కుప్పకూలిందని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని