Mandaviya: ఆయనకు ‘మూడో ముప్పు’ సవాలు..!

తాజా వార్తలు

Published : 08/07/2021 12:26 IST

Mandaviya: ఆయనకు ‘మూడో ముప్పు’ సవాలు..!

కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

దిల్లీ: భాజపా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షల వైపు మొగ్గుచూపింది. లాక్‌డౌన్ విధించి, వ్యాప్తిని కొద్దిమేర కట్టడి చేయగలిగింది. కానీ, రెండో దఫా విజృంభణ మాత్రం మోదీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని ఎఫెక్ట్‌ తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన హర్షవర్ధన్‌పై పడింది. కేబినెట్ విస్తరణలో భాగంగా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండో ముప్పు పూర్తిగా తొలగిపోనేలేదు. మూడోముప్పు గురించి ఆందోళనకర నివేదికలు వెలువడుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు వైద్య సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటు, కరోనా టీకా కార్యక్రమంలో వేగం పెంచాల్సిన అవసరముంది. వీటన్నింటి మధ్య మన్‌సుఖ్ మాండవీయ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

49 ఏళ్ల మన్‌సుఖ్ మాండవీయ గుజరాత్ పార్లమెంటేరియన్. గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్‌లో పట్టా పొందారు. ఈ తరవాత రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఏబీవీపీ) సభ్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం భాజపావైపు అడుగులు పడేలా చేసింది. ఈ క్రమంలోనే 2002లో 28 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరవాత 2016లో సహాయ మంత్రిగా కేంద్రప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించే ఆయన సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చి ఆశ్చర్యపర్చారు. అలాగే కొవిడ్ విధుల్లో తన కుమార్తె కూడా భాగమైందని మెచ్చుకుంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మోదీ-అమిత్‌ షా తనపై ఉంచిన నమ్మకానికి మాండవీయ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా టీకా తయారీ కేంద్రాలను పరిశీలించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ క్యాడిలా, కొవాగ్జిన్ ఉత్పత్తి కేంద్రాలను ఆయన సందర్శించారు. 

రెండో దఫాలో ఏప్రిల్-మే నెలలో కరోనా ఉగ్రరూపం చూపించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 4లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 4,500 మందికిపైగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత వేధించింది. బాధితులు ఆసుపత్రి బయటే ప్రాణాలు వదిలిన ఘటనలు తీవ్రంగా కలవరపరిచాయి. మార్చురీలు, శ్మశాన వాటికలు నిండిపోయి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మృత్యుఘోష వినిపించింది. ఇవన్నీ ప్రభుత్వంపై విమర్శలకు దారితీశాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని