Covishield: డోసుల వ్యవధిలో మార్పు లేదు
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:08 IST

Covishield: డోసుల వ్యవధిలో మార్పు లేదు

దిల్లీ: కరోనా వైరస్‌లో కొత్త కొత్త రకాలు ఉత్పన్నమవుతున్న వేళ కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని తగ్గించాల్సిన అవసరముందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి డోసుల మధ్య వ్యవధిలో ఎలాంటి తక్షణ మార్పులు చేయట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే దీనికి సంబంధించిన శాస్త్రవేత్తల అధ్యయనాలపై నిపుణుల కమిటీ పరిశీలనలను జరుపుతోందని, రాబోయే సమావేశాల్లో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిపాయి. 

కొవిషీల్డ్‌ టీకా డోసుల వ్యవధిని కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు డోసుల మధ్య 6-8 వారాల వ్యవధి ఉండగా.. దాన్ని 12-16 వారాలకు పెంచారు. అయితే కరోనా కొత్త వేరియంట్లు ఉద్ధృతంగా వ్యాప్తిస్తున్నందున డోసుల వ్యవధిని తగ్గిస్తే బాగుంటుందని పలు అధ్యయనాలు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ నిన్న స్పందిస్తూ.. డోసుల వ్యవధిపై ప్రజలెవరూ కంగారు పడొద్దని సూచించింది. 

‘‘టీకాల గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. చాలా పరిశీలనలు జరిపిన తర్వాతే డోసుల వ్యవధిపై మేం నిర్ణయం తీసుకుంటాం. వ్యవధి పెంచాల్సి వచ్చినప్పుడు తొలి డోసు తీసుకున్నవారికి ఎదురయ్యే ముప్పును గురించి కూడా ఆలోచిస్తాం. అయితే అంతకుమించిన విషయమేంటంటే.. ఎక్కువ మంది ప్రజలకు కనీసం తొలి డోసు అందించినా.. వారిలో సాధ్యమైనంత రోగనిరోధక శక్తిని పెంచినట్లవుతుంది. అందువల్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని కోరుతున్నా’’ అని నీతీ ఆయోగ్‌(ఆరోగ్యం) సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని