చక్కా జామ్‌: బెంగళూరు, దిల్లీలో ఉద్రిక్తత

తాజా వార్తలు

Updated : 06/02/2021 17:05 IST

చక్కా జామ్‌: బెంగళూరు, దిల్లీలో ఉద్రిక్తత

దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్‌ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు నేడు తమ పోరాటంలో భాగంగా చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సాగిన ఈ రాస్తారోకో కార్యక్రమంలో పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. 

బెంగళూరులోని యలహంక పోలీస్‌ స్టేషన్‌ బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని షాహీదీ పార్క్‌ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు. 

చక్కాజామ్‌ దృష్ట్యా దిల్లీ-యూపీ సరిహద్దులోని గాజీపుర్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు. అటు సింఘు, టిక్రీ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా దిల్లీలోని పలు ప్రధాన మెట్రో స్టేషన్లను మూడు గంటల పాటు మూసివేశారు. 

ఇంటర్నెట్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. సింఘు, గాజీపూర్‌, టిక్రీ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వరకు సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. శనివారం నిర్వహించిన ‘చక్కా జామ్‌’ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున తలెత్తిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను గతంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సేవలను పూర్తిగా నిలిపివేశారు. అనంతరం పునరుద్ధరించారు.

ఇవీ చదవండి..

సంయమనం పాటించండి..

ఒక్క లోపముంటే చెప్పండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని