Rahul: మోదీ కన్నీళ్లు.. కాపాడలేకపోయాయి
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 17:55 IST

Rahul: మోదీ కన్నీళ్లు.. కాపాడలేకపోయాయి

కొవిడ్‌ నిర్వహణపై కాంగ్రెస్‌ శ్వేతపత్రం విడుదల

దిల్లీ: కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశంలో కరోనా నివారణ చర్యలపై నేడు ఆయన పార్టీ తరఫున శ్వేతపత్రం విడుదల చేశారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, మూడో దశపై సన్నద్ధతలో సాయం చేయాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కన్నీళ్లు.. ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయని దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరతను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. 

‘‘కరోనా నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకు గల కారణాలను మా శ్వేతపత్రంలో పేర్కొన్నాం. తప్పు ఎక్కడ జరిగిందో ప్రభుత్వానికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పత్రాన్ని విడుదల చేశాం. కేంద్రాన్ని వేలెత్తి చూపాలన్నది మా లక్ష్యం కాదు. మరికొద్ది నెలల్లో మూడో దశ ముప్పు ఉందని దేశమంతా తెలుసు. దానికి సన్నద్ధమయ్యేలా ప్రభుత్వానికి సాయం చేసేందుకే ఈ వివరాలు వెల్లడించాం. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి’’ అని రాహుల్‌ వివరించారు. 

కరోనా వ్యాప్తి కట్టడిలో వ్యాక్సినేషన్‌ మూలస్తంభం లాందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. 100శాతం టీకా పంపిణీ చాలా ముఖ్యమని, అందుకు తగినట్లుగా కేంద్రం చర్యలు ఉండాలని సూచించారు. సోమవారం రికార్డు స్థాయిలో డోసుల పంపిణీ జరిగిందని, అయితే ఇది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని కోరారు. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. అంతేగాక, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా టీకా సరఫరాలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని అభ్యర్థించారు. ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి వైద్య సామగ్రిని తగినంత అందుబాటులో ఉంచాలని కోరారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా రెండో దశలో పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘రెండో దశలో 90శాతం మరణాలకు ప్రధాన కారణం ఆక్సిజన్‌ కొరత. మోదీ కన్నీళ్లు వారిని కాపాడలేకపోయాయి. కానీ ప్రాణవాయువు వారిని కాపాడేదేమో. ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను మోదీ కన్నీళ్లు చెరపలేవు. ఆ సమయంలో ఆక్సిజన్‌ సమస్యను ప్రధాని పట్టించుకోకుండా బెంగాల్‌పై దృష్టిపెట్టారు’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని