మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభణ.. కారణాలేంటి?

తాజా వార్తలు

Published : 17/02/2021 17:57 IST

మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభణ.. కారణాలేంటి?

ముంబయి: దేశంలో రోజువారీ కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో 100లోపే కొత్త కేసులు నమోదవుతుండగా.. దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ‘సున్నా’ కేసులు నమోదువుతుండడం ఊరట కలిగించే విషయం. అయితే, కరోనా వ్యాపించడం మొదలైన నాటి నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. రోజుకు 20వేలకు పైగా కేసులు చూసిన ఆ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తామంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి తలెత్తింది?

కేసులు ఇలా..
మహారాష్ట్రలో సెప్టెంబర్‌ నెలలో రోజుకు అత్యధికంగా 22 నుంచి 23 వేల కేసులు నమోదయ్యేవి. మరణాలూ అదే స్థాయిలో నమోదయ్యేవి. కేసులు, మరణాల పరంగా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇవన్నీ చూసిన వారికి ఆ రాష్ట్రం తిరిగి కోలుకుంటుందా?అన్న సందేహం ఎదురయ్యేది. అలాంటిది జనవరి నెలలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జనవరిలో కేవలం 2వేల నుంచి 2500 కేసులు మాత్రమే వెలుగుచూసేవి. తాజాగా మరోసారి 3వేల కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 4వేల కేసులు రావడంతో మరోసారి ఆందోళన మొదలైంది. చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ తగ్గుదల కనిపిస్తున్న వేళ ఇక్కడ మళ్లీ కేసుల గ్రాఫ్‌ పైకి లేస్తుండడం గమనార్హం. జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంతో పోలిస్తే ఫిబ్రవరి రెండో వారంలో కేసులు క్రమంగా పెరుగుతుండడం కలకలం రేకెత్తిస్తోంది.

మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయ్‌?

మహారాష్ట్రలో ముంబయి సహా విదర్భ ప్రాంతాల్లో కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. చాలా రోజులుగా నిలిచిపోయిన లోకల్‌ రైళ్లకు అనుమతివ్వడం ముంబయి ప్రాంతంలో కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మరో కారణమని తెలుస్తోంది. సతారా జిల్లాలోని ఓ గ్రామ జనాభా 1900 కాగా.. ఆ ఒక్క గ్రామంలోనే ఒకేరోజు 62 కేసులు నమోదయ్యాయి. దీనిబట్టి కొవిడ్‌-19 మనల్ని వీడి వెళ్లిపోయిందన్న అపోహతో ప్రజలంతా గుమిగూడుతున్నారని అర్థమవుతోందని అధికారులు అంటున్నారు. పైగా కొవిడ్‌ కారణంగా వాయిదా పడిన శుభకార్యాలన్నీ ఇప్పుడు నిర్వహిస్తుండడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటివి మరిన్ని కారణాలని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏమంటోంది?

రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై మహరాష్ట్రలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజల్ని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ కావాలో, వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించడం లేదని ఆరోగ్యమంత్రి రాజేశ్‌ తోపే అన్నారు. అవసరమైతే స్కూళ్లు మూసివేయాలని అధికారులకు సూచించామన్నారు. తొలినాళ్లతో పోలిస్తే కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం పెద్దగా అమలవ్వడం లేదని, టెస్టులు సంఖ్య కూడా తగ్గడం వ్యాప్తి పెరుగుదలకు కారణమవుతోందని ఆ రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్‌ అవతే అంగీకరించారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ పరిస్థితి చేయిదాటిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని